Begin typing your search above and press return to search.

ప్ర‌ధానిపై టీఆర్ ఎస్ ప్రివిలేజ్ మోష‌న్‌.. స‌భ నుంచి వాకౌట్‌

By:  Tupaki Desk   |   10 Feb 2022 10:35 AM GMT
ప్ర‌ధానిపై టీఆర్ ఎస్ ప్రివిలేజ్ మోష‌న్‌.. స‌భ నుంచి వాకౌట్‌
X
రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ ఎస్‌ ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను ఆ పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్‌కుమార్‌, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ కలిసి నోటీసు అందజేశారు. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు.

అనంతరం తెలంగాణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాజ్య‌స‌భ‌లో నిలబడి టీఆర్ ఎస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు ఎంపీ కె.కేశవరావు రాజ్యసభలో ప్రస్తావించారు.

సభ్యులను వారించిన డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ నారాయణ్.. సభలో గొడవ చేయడం తగదన్నారు. నోటీసు ను ఛైర్మన్‌ పరిశీలనకు పంపామని.. సంయమనం పాటించాలని సూచించారు. అయితే టీఆర్ ఎస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. నోటీసుపై నిర్ణయం తీసుకునే వరకూ సభకు వెళ్లకూడదని నిర్ణయించారు.

మ‌రోవైపు.. ప్రధానిపై లోక్‌సభలో కూడా టీఆర్ ఎస్‌ ఎంపీలు నోటీసు ఇవ్వనున్నారు. సభా హక్కుల ఉల్లంఘ న కింద మధ్యాహ్నం స్పీకర్‌ను కలిసి నోటీసు ఇవ్వాలని ఎంపీలు నిర్ణయించుకున్నారు. సాయంత్రం లోక్‌సభలో నిరసన తెలపాలని నిర్ణయించినట్లు సమాచారం. నోటీసుపై నిర్ణయించే వరకు సభ బహిష్కరించాలని నిర్ణయించారు.

ఇటీవల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నేత‌లు మండిప‌డుతున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ... ఆంధ్రప్రదేశ్‌ విభజన అవమానకరంగా జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో లోక్‌స‌భ‌, రాజ్యసభ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. మ‌రోవైపు కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా టీఆర్ఎస్ వాదనతో సంఘీభావం తెలిపాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు.