Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో దొంగ ఓట్ల నమోదా?

By:  Tupaki Desk   |   10 July 2021 2:30 PM GMT
హుజూరాబాద్ లో దొంగ ఓట్ల నమోదా?
X
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చి ఓటు వేయడం.. రాజకీయ పార్టీల నేతలు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడానికి ఇతర ప్రాంతాల్లోని వారిని దొంగ ఓటర్లుగా నమోదు చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అవే ఆరోపణలు హుజూరాబాద్ పై వస్తున్నాయి.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడే హుజూరాబాద్ లో ప్రచారం మొదలుపెట్టారు. అందరినీ కలుస్తూ.. సంకలనం చేస్తూ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేకున్నా నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధం లేకుండా దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం మొదలు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. నాలాంటి వాళ్లను గుర్తించి ఓటేయ్యాలనుకునే వారి ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు.

ఒక ఇంట్లోనే 30 నుంచి 40 ఓట్లు నమోదు చేసి దొంగ పనులకు ఒడిగడుతున్నారని ఈటల సంచలన ఆరోపణలు చేశారు.చట్టబద్దమైన చర్యల కోసం పోరాడుతామన్నారు.

హుజూరాబాద్ లో ఓటు తొలగించకుండా కంటికి రెప్పలా మీ ఓటు కాపాడుకోండి అంటూ హుజూరాబాద్ ఓటర్లకు ఈటల విజ్ఞప్తి చేశారు. అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే చట్టపరంగా శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. ఉద్యమకారుల రక్తాన్ని చూసిన వారు.. కేసీఆర్ ను తిట్టినవారు ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారంటూ ఈటల ఎద్దేవా చేశారు.

-తిరుపతిలోనూ బయటపడ్డ దొంగ ఓట్లు
ఏపీలోని తిరుపతిలోనూ ఇలానే మొన్నటి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేగాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో భారీగా దొంగ ఓటర్లు పట్టబడ్డారు. బీజేపీ, టీడీపీ నేతలు ప్రతీ పోలింగ్ బూతుకు తిరుగుతూ దొంగ ఓటర్లను ఏరివేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతిలో పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారని ఇప్పటికే టీడీపీ, బీజేపీలు ఆరోపించాయి. పలు చోట్ల వాహనాల్లో వస్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు.

తిరుపతిలో ఓటేసేందుకు వచ్చిన పక్క జిల్లాల ఓటర్లను పలువురిని బీజేపీ, టీడీపీ నేతలు పోలింగ్ వేళ ఎక్కడికక్కడ పట్టుకున్నారు. తిరుపతిలో నకిలీ ఓటర్లపై బీజేపీ అభ్యర్థి రత్నప్రభ స్వయంగా చెక్ చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ సైతం ఫిర్యాదు చేశారు. ఓ బీజేపీ మహిళ నేత పోలింగ్ బూతును సందర్శించి అక్కడ క్యూలో నిలబడ్డ ఓటరు స్లిప్ తీసుకొని తన ఇంటిపేరు, తండ్రి పేరు సహా అడ్రస్ ను అడిగింది. దానికి ఆ ఓటరు తడబడడం.. తెలియదని అనడంతో దొంగ ఓటుగా నిర్ధారించి సీరియస్ అయ్యి పోలీసులను పిలిపించి పంపించివేసింది. ఆ క్యూలైన్లో దాదాపు 10 మంది వరకు దొంగ ఓటర్లు నేతలకు చిక్కడం విశేషం. అలాంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారని.. వారు ఎవరు? ఎందుకు వచ్చారనే దానిపై ఇప్పటికీ అంతు తేలలేదు.

ఇప్పుడు హుజూరాబాద్ లోనూ అదే పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా పక్క ప్లాన్ తో సాగుతోందని.. దీన్ని అడ్డుకోవాలని తాజాగా బీజేపీ నేత ఈటల రాజేందర్ పిలుపునిచ్చాడు. బీజేపీ సైతం దీనిపై పోరుబాటకు సిద్ధమవుతోంది.