Begin typing your search above and press return to search.

ఆ ఎంపీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్‌..!

By:  Tupaki Desk   |   7 Jan 2022 3:07 AM GMT
ఆ ఎంపీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్‌..!
X
త‌మ పాల‌న‌కు కంట‌గింపుగా మారిన ప‌లువురు వ్య‌క్తుల‌ను క‌ట్ట‌డి చేసేందుకు టీఆర్ఎస్‌ ఎత్తులు వేస్తోంది. ప్ర‌తిప‌క్షాల ఎత్తుల‌ను గ‌మ‌నిస్తూ చిత్తు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే అధికార పార్టీ పంతా ఏమిటో అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు మ‌రో నేత‌పై ఆ పార్టీ గురి పెట్టింది. ప్ర‌భుత్వంపై వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను ప‌క్క‌కు మ‌ళ్లించేందుకే టీఆర్ఎస్ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు. మొద‌ట్లో గులాబీ పార్టీ మాజీ నేత‌, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ను ప్ర‌భుత్వం ముప్పుతిప్ప‌లు పెట్టింది. భూముల కుంభ‌కోణాల‌ను బ‌య‌ట‌కు తీసింది. అయినా ప్ర‌జ‌లు త‌మ తీర్పుతో ప్ర‌భుత్వ ద‌మ‌న‌కాండ‌ను నిలువ‌రించారు. అయినా ప్ర‌భుత్వం త‌మ చ‌ర్య‌ల‌ను మానుకోలేదు.

ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. ఏకంగా సీఎం ద‌త్త‌త గ్రామం ఎర్ర‌వ‌ల్లినే వేదిక‌గా ఎంచుకున్నారు. ప్ర‌జ‌ల‌ను ధాన్యం పండించ‌వ‌ద్ద‌ని చెప్పి.. కేసీఆరే స్వ‌యంగా ఆయన ఫాంహౌస్‌లో వంద‌ల ఎక‌రాల్లో వ‌రి పండిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీన్ని నిగ్గు తేల్చేందుకు ఎర్ర‌వ‌ల్లిలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. కొవిడ్ నిబంధ‌న‌ల పేరుతో పోలీసులు ఈ కార్య‌క్ర‌మాన్ని విఫ‌లం చేశారు. రేవంత్‌ను క‌నీసం ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా వెళ్లే వీలు లేకుండా హౌజ్ అరెస్టు చేశారు.

ఆ త‌ర్వాత తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన 317 జీవోపై క‌రీంన‌గ‌ర్‌లో దీక్ష చేప‌ట్టారు. కొవిడ్ నిబంధ‌న‌ల పేరుతో పోలీసులు దీనిని కూడా అడ్డుకున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని ఏకంగా బండి సంజ‌య్‌ని అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. దీన్ని బండి సంజ‌య్ ఆక్షేపించారు. ఇటీవ‌ల న‌ల్ల‌గొండ‌లో కేటీఆర్ వంద‌ల బైకుల‌తో ర్యాలీ తీయ‌గా లేనిది.. త‌ను దీక్ష చేస్తే ఇబ్బంది క‌లిగిందా అని ప్ర‌శ్నించారు.

ఇలా రేవంత్‌, సంజ‌య్ ల‌కు షాక్ ఇచ్చిన ప్ర‌భుత్వం ఇప్పుడు మ‌రో నేత‌ను టార్గెట్ గా పెట్టుకుంది. బీజేపీ ఎంపీ అర్వింద్‌ను అడ్డుకోవాల‌ని భావిస్తోంది. దీనికి నిదర్శ‌న‌మే ఇటీవ‌ల ఆయ‌న‌పై ఏడు జీరో ఎఫ్ఐఆర్ కేసులు న‌మోదు కావ‌డం. ఈ కేసుల‌ను ఈపాటికే బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌కు బ‌దిలీ చేశారు. ఈ కేసుల‌కు సంబంధించి క‌ఠిన చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. పాత కేసుల‌ను తిర‌గ‌దోడి అర్వింద్ దూకుడును అడ్డుకోవాల‌ని గులాబీ పార్టీ ఆలోచ‌న‌గా ఉంది. ఈ అంశంపై అర్వింద్ ఎలా ముందుకు వెళ‌తారో.. ప్ర‌భుత్వాన్ని ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి.