Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ ఓటు

By:  Tupaki Desk   |   16 March 2018 10:37 AM GMT
మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ ఓటు
X
ఢిల్లీలో తెలుగు రాజకీయ పార్టీల కేంద్రంగా ప‌రిణామాలు మ‌లుపులు తిరుగుతున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం ఇటు టీడీపీ అటు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయా పార్టీల వైఖ‌రిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అయితే జాతీయ రాజ‌కీయాల‌పై గ‌ళం విప్పుతున్న గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ నిర్ణ‌యంపై అంద‌రి చూపు ప‌డింది. తాజాగా కేసీఆర్ టీం త‌న వైఖ‌రిని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు వస్తే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్‌పై విప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌పై క‌ర్నె స్పందించారు. ఈ సంద‌ర్భంగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్నారు. ఇందుకోసం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము సంఘీభావం తెలుపుతున్న‌ట్లు వివ‌రించారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని క‌ర్నె ప్ర‌భాక‌ర్ అన్నారు. బడ్జెట్‌పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ మాటలు అక్షర సత్యాలుగా అమలవుతాయని బడ్జెట్ మరోమారు నిరూపించిందని కొనియాడారు. దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో జీడీపీ 5 శాతంగా నమోదయ్యేది. ఇప్పడు తెలంగాణ జీడీపీ రెండంకెల స్థాయిని దాటింద‌న్నారు. 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణదేన్నారు.

బడ్జెట్ ఇంత బాగా ఉంటే కాంగ్రెస్ నేతలు దొంగ దీక్షలు చేస్తూ పిల్లి శాపాలు పెడుతున్నరని క‌ర్నె ప్ర‌భాక‌ర్‌ దుయ్యబట్టారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలు గత ఎన్నికల్లో తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఎప్పుడో అమ్మేసేవాళ్లన్నారు. జైపాల్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ శక్తి ఏమిటో త్వరలోనే దేశం చూడబోతుందని పేర్కొన్నారు.