Begin typing your search above and press return to search.

వరుస ఎదురుదెబ్బలతో ‘ట్రబుల్ షూటర్’ మాటకే ఎసరు

By:  Tupaki Desk   |   31 Oct 2021 10:17 AM IST
వరుస ఎదురుదెబ్బలతో ‘ట్రబుల్ షూటర్’ మాటకే ఎసరు
X
నేరుగా తప్పులు చేయాల్సిన అవసరం ఉండదు కొన్నిసార్లు. ఎవరో చేసే తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ కమ్ మంత్రి హరీశ్ రావు పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆయనకు చేదు అనుభవాన్ని మిగల్చటమే కాదు.. తనకున్న ట్రబుల్ షూటర్ మార్కును దెబ్బ తీస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. పార్టీకి ఏదైనా కష్టం వస్తే తాను ఉంటానన్న రీతిలో మేనమామకు దన్నుగా నిలిచే మేనల్లుడి పాత్రను నూటికి నూరుశాతం పోషిస్తున్న ఆయనపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు కూరలో కరివేపాకు మాదిరి హరీశ్ ను వాడుకుంటున్న కేసీఆర్.. హరీశ్ వ్యక్తిగత ఇమేజ్ మసకబారేట్లు చేస్తున్నారని చెబుతున్నారు.

గెలిచే ఎన్నికలకు తన కొడుకు కేటీఆర్ కు బాధ్యత అప్పగించే గులాబీ బాస్.. ఓడే ఎన్నికలకు మాత్రం హరీశ్ కు బాధ్యత అప్పజెప్పటం దేనికి నిదర్శమని ప్రశ్నిస్తున్నారు. తననో అస్త్రంగా ప్రయోగిస్తున్న మేనమామ తీరు తెలిసినా.. ఆయన మాత్రం తనకు అప్పజెప్పిన బాధ్యతను నూటికి నూరుశాతం అమలు అయ్యేట్లుగా చేస్తున్న తీరు బాగానే ఉన్నా.. ఈ క్రమంలో లేనిపోని తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది.

హుజూరాబాద్ ఉపఎన్నిక విషయాన్నే తీసుకుంటే.. మొన్నటివరకు ఈటలతో కలిసి జట్టు కట్టిన హరీశ్.. అందుకు భిన్నంగా ఎన్నికల ప్రచారంలో ఆయనపై చేసిన వ్యాఖ్యలు.. సంధించిన ఆరోపణలు గీత దాటేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఏళ్లకు ఏళ్లు కలిసి ఉండి.. అప్పటివరకు ఆణిముత్యంగా ఈటలను కీర్తించిన నోటితోనే.. హరీశ్ తిట్టటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోయారని చెబుతున్నారు. ఎంత మేనమామ టాస్కు అప్పగిస్తే మాత్రం.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం ద్వారా.. తనకంటూ ఉండే ఇమేజ్ ను దెబ్బ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న పలువురి నోట వస్తోంది.

పోలింగ్ జరిగిన తీరు చూసిన వారంతా.. గెలుపు ఈటల ఖాతాలో పడుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో.. ఓటమికి సంసిద్ధమయ్యేందుకు టీఆర్ఎస్ శ్రేణులు మానసికంగా సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈటలపై ఒక రేంజ్ లో విరుచుకుపడిన హరీశ్.. ఆయనపై చేసిన వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు గెలుపు ధీమాను వ్యక్తం చేసి.. ఎన్నికల కోసం తెర వెనుక నడిపిన మంత్రాంగం చూసిన వారికి.. ఒక ఉప ఎన్నిక కోసం ఇంతలా దిగజారాలా? అన్న మాట వినిపించింది. ఎన్నికల వేళ పార్టీ కోసం పని చేయటం.. పార్టీ లైన్ కోసం శ్రమించటాన్ని ఎవరూ తప్పు పట్టరు. అదంతా ప్రొఫెషనల్ పద్దతిలో సాగాలి. అందుకు భిన్నంగా వ్యక్తిగత అంశంగా తీసుకోవటమే తప్పు అవుతుంది. హుజూరాబాద్ ఎపిసోడ్ లో హరీశ్ తీరు ఇలానే ఉందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.