Begin typing your search above and press return to search.

గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా కమలనాథుల భారీ ప్లానింగ్

By:  Tupaki Desk   |   17 Jun 2022 2:30 AM GMT
గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా కమలనాథుల భారీ ప్లానింగ్
X
టార్గెట్ చేయనంతవరకు ఓకే. కానీ.. ఒక్కసారి లక్ష్యాన్ని ఫిక్సు చేసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు చొప్పున.. కొంతకాలానికి అన్నివైపుల నుంచి అందరూ కమ్మేసే కచ్ఛితమైన వ్యూహం కమలనాథుల సొంతం. ఇదే ఆ పార్టీని అంతకంతకూ శక్తివంతం చేయటంతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేలా చేసింది. ఇది సరిపోదన్నట్లు.. అధికారం అరచేతి వరకు వచ్చి ఆగితే.. దాన్ని ఏదోలా అందిపుచ్చుకునేందుకు విలువల గీత దాటేందుకు సైతం వెనుకాడని దూకుడుతనం మోడీషాల హయాంలో బీజేపీ కొత్తగా వంట పట్టేసుకుంది. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాము అనుకున్నది మాత్రం జరగాలన్న పంతం బీజేపీలో ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

కమలనాథుల కన్ను ఇప్పుడు తెలంగాణలో పడటం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలు పెద్ద ఎత్తున ఉండాలన్న సంకల్పంతో సరికొత్త ప్లానింగ్ తో ముందుకు వెళుతోంది. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో తెలంగాణలో బీజేపీ యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయి. ఎక్కడ ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్నా తక్షణమే వాలిపోతున్న కమలనాథులు.. తాము ఉన్నామన్న భరోసాను ఇవ్వటంతో పాటు.. వారితో ఉండటం ఈ మధ్యన ఎక్కువైంది.

ఓవైపు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకెళుతున్న కమలనాథులు.. మరోవైపు భారీ ఎత్తున నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి హైదరాబాద్ అడ్రస్ గా మారనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. భారీ బహిరంగ సభతో పాటు.. తమ సత్తాను చాటేలా ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారం పాటుజిల్లాల్లో పర్యటనలు.. కార్యవర్గ భేటీలతోపాటు బహిరంగ సభల్ని డిజైన్ చేశారు.

ఇంతకూ బీజేపీ లక్ష్యం ఏమంటే.. తెలంగాణ అధికారపక్షానికి అసలుసిసలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తామేనన్న విషయాన్ని తేల్చి చెప్పటమే. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తాయన్న విషయంపై బోలెడన్ని వాదనలు వినిపిస్తున్న వేళ.. దేనికైనా.. ఎప్పుడైనా సిద్ధమన్న రీతిలో తయారు కావాలన్నదే బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు.

వచ్చే నెల మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్ ను.. వివిధ వర్గాలకు చెందిన ప్రజల్ని సమీకరించాలని భావిస్తున్నారు.

త్వరలో నిర్వహించే జాతీయ కార్యవర్గ భేటీ వేళ.. తెలంగాణలో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని అధినాయకత్వానికి అర్థమయ్యేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యమం వేళ నుంచి కేసీఆర్ కు సరైన రాజకీయ ప్రత్యర్థి లేదన్న మాటను తిరగరాసేలా.. ఆయనకున్న తిరుగులేని అధిక్యతను దెబ్బ తీసేలా తాజా ప్లానింగ్ జరుగుతుందని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కమ్మేస్తున్న కమలనాథుల్ని కేసీఆర్ ఏ రీతిలో ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగామారిందని చెప్పక తప్పదు.