Begin typing your search above and press return to search.

గులాబీ ఎమ్మెల్యే ప్రసవం.. కార్యకర్తల అతి మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   10 Oct 2022 5:33 AM GMT
గులాబీ ఎమ్మెల్యే ప్రసవం.. కార్యకర్తల అతి మామూలుగా లేదుగా?
X
మీడియా స్థానాన్ని సోషల్ మీడియా కబ్జా చేసిన వేళ.. వాస్తవాల విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. ఎవరికి వారు వారికి సంబంధించిన మైలేజీ కోసం చేసే ప్రయత్నాలు కొన్ని అయితే.. తాము అభిమానించే వారిని మరింత ఆదరణ తెచ్చేందుకు చేసే ప్రయత్నాలు కొత్త తలనొప్పులకు కారణమవుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు టీఆర్ఎస్ కు చెందిన మహిళా ఎమ్మెల్యే. దసరా పండుగపూట పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన వేళ.. ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉన్న వేళ.. ఆమె అభిమానులు చేసిన అతి.. తలనొప్పిగా మారటమే కాదు.. కొత్త తిప్పల్ని తెచ్చి పెట్టింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇటీవల తల్లయ్యారు. దసరా రోజున ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలిసినంతనే పార్టీ కార్యకర్తలు.. అభిమానులు సందడి చేశారు. స్వీట్లు పంచుకున్నారు. ఇక్కడి వరకు ఆగితే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. అతిగా ఆలోచించి.. డెలివరీతో మరింత మైలేజీ తీసుకురావాలన్న తపనతో.. ఎమ్మెల్యే తన డెలివరీని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకున్నారని.. కేసీఆర్ సర్కారు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతగానో మెరుగుపడ్డాయంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవటం ఆమె గొప్పతనంగా కీర్తించటం మొదలు పెట్టారు.

ఇది నిజమని భావించిన మరికొందరు ఆమెను పొగడటం మొదలు పెట్టారు. వాస్తవానికి ఎమ్మెల్యే హరిప్రియ ఒక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డెలివరీ జరిగింది. వాస్తవం ఇలా ఉంటే.. ప్రచారం మాత్రం మరోలా జరగటంతో మరికొందరు.. ఇదెక్కడి పాడు ప్రచారం అంటూ ట్రోల్ చేయటం షురూ చేశారు.

జరగనిదానిని జరిగినట్లుగా ఎలా ప్రచారం చేసుకుంటారు? అంటూ ప్రశ్నించటం మొదలైంది. ఎమ్మెల్యే హరిప్రియ డెలివరీ ఇల్లందులోని రావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గైనకాలజిస్టు కల్పన పర్యవేక్షణలో జరిగింది. వాస్తవం ఇదైతే.. మైలేజీ కోసం ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తారా? అంటూ పోస్టింగులతో రివర్సు అయ్యారు. ఎంత మైలేజీ కావాలంటే మాత్రం.. ఇలా తప్పుదారి పట్టించటమా? అబద్ధాన్ని నిజంగా నమ్మించటమా? అంటూ విరుచుకుపడ్డారు.

వాస్తవానికి ఈ ఎపిసోడ్ లో ఎమ్మెల్యే హరిప్రియ తప్పేం లేదు. ఆమె అనుచరుల అతితోనే ఇలాంటి ప్రచారం షురూ అయ్యింది. దీంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంతో ఉన్న ఎమ్మెల్యే ఇంట.. అభిమానుల అత్యుత్సాహం వారికి తలనొప్పిగా మారింది. దీని లెక్క తేల్చేందుకు రంగంలోకి దిగారు పార్టీ జిల్లా అధ్యక్షులు కమ్ ఇల్లందు నియోజకవర్గ బాధ్యుడిగా వ్యవహరించిన తాతా మధు సీన్లోకి వచ్చారు. వాస్తవానికి విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దన్నారు.

ఈ తరహా ప్రచారం నేతల ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేయటమే కాదు.. పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని చెబుతూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు తెర దించే ప్రయత్నం చేశారు. దీంతో.. వాతావరణం కాస్తంత ప్రశాంతంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.