Begin typing your search above and press return to search.

గులాబీ మహిళా ఎంపీకి జైలుశిక్ష.. ఫైన్.. అరెస్టు ఎందుకు కాలేదంటే?

By:  Tupaki Desk   |   25 July 2021 4:04 AM GMT
గులాబీ మహిళా ఎంపీకి జైలుశిక్ష.. ఫైన్.. అరెస్టు ఎందుకు కాలేదంటే?
X
టీఆర్ఎస్ పార్టీ ఎంపీ.. మహిళా నేత మాలోత్ కవితకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కేసులో ఆమెకు ఆర్నెల్లు జైలుశిక్షతో పాటు.. జరిమానాను విధిస్తూ తీర్పును ఇచ్చిన వైనం షాకింగ్ గా మారింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేసి.. వరుస పెట్టి విచారణలు జరుపుతున్న న్యాయస్థానం కారణంగా పెండింగ్ లో ఉన్న కేసులన్నివేగంగా పరిష్కారమవుతున్న పరిస్థితి. ఇప్పటివకే పలు కేసుల్ని పరిష్కరించిన ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా విచారణ జరిపి తుది తీర్పులు ఇచ్చింది. ఇందులో భాగంగా మాలోజు కవితపై నమోదైన కేసులో ఆమెకు జైలుశిక్షను విధించటం సంచలనంగా మారింది.

ఇంతకూ ఆ కేసేమిటి? దాని పూర్వాపరాలేమిటి? అన్న విషయంలోకి వెళితే.. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ స్థానానికి మాలోత్ కవిత పోటీ చేశారు. అయితే.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లుగా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన కేసును పోలీసులు నమోదు చేశారు. ఆమె అనుచరుడు షౌకత్ అలీ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎన్నికల ప్లయింగ్ స్వ్రాడ్ కు పట్టుబడ్డారు.

ఈ కేసు విచారణ తాజాగా నాంపల్లి కోర్టు ముందుకు వచ్చింది. కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన కోర్టు.. ఎంపీ మాలోత్ కవితను ఆర్నెల్లు జైలుశిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. తీర్పు వెలువడిన వెంటనే ఫైన్ కట్టేసిన ఆమె.. బెయిల్ కోసం అభ్యర్థనను కోర్టు ముందు ఉంచారు. దీనికి సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా.. మరో కేసులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మాత్రం ఊరట లభించింది.

ఓటర్లకు డబ్బులు పంచటంతో పాటు.. ప్రజా జీవనానికి విఘాతం కలిగించారన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయనపై ఉన్న 12 కేసులపైనా నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు డబ్బులు పంచినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భద్రాచలంనుంచి పోటీ చేశారు. వీరయ్యతో పాటు మరికొందరిపైనా భద్రాచలం.. చర్ల.. దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాజా విచారణకు కోర్టు ఎదుట హాజరైన వీరయ్యపై నమోదు చేసిన అభియోగాలు రుజువు కాకపోవటంతో ఆయనపై ఉన్న కేసుల్ని కొట్టివేస్తున్నట్లుగా కోర్టు వెల్లడించింది. దీంతో.. ఆయన కేసుల నుంచి విముక్తి అయ్యారు.