Begin typing your search above and press return to search.

ఉల్లి ఎంత పని చేసిందంటే.. డ్రైవర్ ను బంధించి మరీ చోరీ

By:  Tupaki Desk   |   29 Dec 2019 5:00 AM GMT
ఉల్లి ఎంత పని చేసిందంటే.. డ్రైవర్ ను బంధించి మరీ చోరీ
X
బ్యాంకులు దోచుకోవటం.. బంగారన్ని దొంగతనం చేయటం.. ఏటీఎంలను బద్దలు కొట్టటం.. ఇలా చెప్పుకుంటూ పోతే దొంగతనాలకు అడ్డూ ఆపే ఉండదు. అదేం దరిద్రమో కానీ.. ఆకాశమే హద్దుగా మారిన ఉల్లి ధరల నేపథ్యంలో.. వాటిని దొంగతనం చేస్తున్న తీరు ఇప్పుడు షాకింగ్ మారింది.

తాజాగా బిహార్ లో చోటు చేసుకున్న ఉల్లి దోపిడీ గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. కేజీ పది.. పదిహేను వరకూ మాత్రమే పలికే ఉల్లి ఏకంగా రూ.200 వరకూ వెళ్లి ప్రస్తుతం రూ.120 నుంచి రూ.150 మధ్య నడుస్తోంది. ఇంత భారీగా ధర పెరిగిన నేపథ్యంలో ఉల్లిపాయల మీద దాడి చేయటం.. వాటిని దోచుకెళుతున్న ఘటనలు తరచూ తెర మీదకు వస్తున్నాయి.

తాజాగా బీహార్ లోని కైమూరు జిల్లాలో ఉల్లి దోపిడీ కోసం వేసిన భారీ స్కెచ్ చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. 51 క్వింటాళ్ల (ఒక్కో క్వింటాల్ 100కేజీలు) ఉల్లి లోడుతో వెళుతున్నట్రక్కును టార్గెట్ చేసిన దుండగులు. వ్యూహం ప్రకారం ఉల్లి ట్రక్కును ఆపేసినంతనే.. అందులోని డ్రైవర్ ను బంధించారు.

అనంతరం మారణాయుధాలతో బెదిరించి.. ట్రక్కులోని 102 క్వింటాళ్ల ఉల్లిని దోచుకెళ్లారు. ఆరుగురు దుండగులు కలిసి ప్లాన్ చేసిన ఉల్లి దోపిడీ స్థానికంగా సంచలనంగా మారింది. ఉల్లి దోపిడీ కోసం ఇంత భారీ స్కెచ్ వేయటమా అని పోలీసులు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి. ఉల్లి ట్రక్కును దోపిడీ చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. దోచుకున్న ఉల్లిని గుర్తించేందుకు కిందామీదా పడుతున్నారు.