Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కారుకు చుక్కలు చూపించిన ట్రక్కు

By:  Tupaki Desk   |   14 Dec 2018 1:09 PM GMT
టీఆర్ఎస్ కారుకు చుక్కలు చూపించిన ట్రక్కు
X
టీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా 88 సీట్లలో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కారు జోరును ట్రక్కు ఆపేసింది. కారు గుర్తును పోలిన ట్రక్కు చాలా ఓట్లు చీల్చి టీఆర్ఎస్ అభ్యర్థులను ముచ్చెమటలు పట్టించింది. కరీంనగర్ పూర్వపు జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోటీచేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది ఈ ట్రక్కు గుర్తే. ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 441 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచి చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా బతికి బయటపడ్డారు. కొప్పుల ఈశ్వర్ కు పడాల్సిన ఓట్లు ప్రతి రౌండ్ లోనూ 1000 చోప్పున ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి పడ్డాయి. దాదాపు 12వేల ఓట్లు ధర్మపురిలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సాధించాడు. ఇవన్నీ టీఆర్ఎస్ ఓట్లే కావడం విశేషం.

ఇక నకిరేకల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయ్యింది. ఫార్వర్డ్ బ్లాక్ తరుఫున నిలబడ్డ క్యాండిడేట్ నకిరేకల్ లో 10000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచాడు. ఇతడు నియోజకవర్గంలో ఎవ్వరికీ తెలియని స్వతంత్ర అభ్యర్థే. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి 85000 ఓట్లు సాధించాడు. కాంగ్రెస్ అభ్యర్థి 93000 ఓట్లు సాధించి గెలిచాడు. అంటే ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుకు పడిన 10000 ఓట్లు కలుపుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఈజీగా గెలిచేవాడే.. ఇక్కడ కారుకు పడాల్సిన పదివేల ఓట్లు ట్రక్కుకు పడ్డాయి. దీంతో నకిరేకల్ లో టీఆర్ఎస్ ఓడిపోయిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుపై అభ్యర్థులు పోటీచేశారు. ఈ ట్రక్కు గుర్తు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఎల్ఎఫ్బీ) పార్టీకి చెందింది. ఈ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు చాలా నియోచకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించడం విశేషం. కారు గుర్తును పోలిన ట్రక్కుకు వృద్ధులు ఇతరులు పొరబడి ఓటేయడం వల్లే ఇది సాధ్యమైంది.

చాలా మంది వృద్ధులు, కంటి చూపు సరిగా లేని వాళ్లు కారు అనుకొని ట్రక్కుకు ఓటేశారు. అంతేకాకుండా చీకట్లో ఈవీఎంలు పెట్టడం వల్ల కొందరు తికమకపడి కారు అనుకొని దాన్ని పోలిన ట్రక్కుకు వేశారు.

2014 ఎన్నికల్లోనూ ఆటో గుర్తు కారును పోలిఉండి చాలా మంది విజయావకాశాలను దెబ్బతీసింది. ఇప్పుడు ట్రక్కు కూడా టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాలతో దోబూచులాడింది. ఈ ట్రక్కు గుర్తుపై ఇప్పటి కే టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ గుర్తును కేటాయించవద్దని కోరారు.