Begin typing your search above and press return to search.

ప్రపంచానికి మేమే వ్యాక్సిన్ సరఫరా చేస్తాం : ట్రంప్ !

By:  Tupaki Desk   |   29 July 2020 2:00 PM GMT
ప్రపంచానికి మేమే వ్యాక్సిన్ సరఫరా చేస్తాం : ట్రంప్ !
X
అమెరికా లో కరోనా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తోంది. కరోనా కేసులు, మరణాలు.. అగ్రరాజ్యంలో రికార్డుస్థాయి లో నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనాను అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మంగళవారం వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ట్రంప్ మాట్లాడుతూ .. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ను అమెరికానే సరఫరా చేస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. వ్యాక్సిన్ తయారీకి దేశ వ్యాప్తంగా శరవేగంగా ప్రక్రియ కొనసాగుతుంది అని , వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, వెంటిలేటర్లు ఇతర సామాగ్రిని పంపిణీ చేసిన తరహాలోనే వ్యాక్సిన్ ‌ను కూడా అమెరికానే ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంది అని చెప్పారు. కాగా.. ఈ ఏడాది చివరికల్లా లేదా 2021 ఆరంభానికి మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ సర్కార్ విశ్వసిస్తుంది.

కాగా.. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో దాదాపు 1,227 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మే తర్వాత ఒకే రోజు 1200 కరోనా మరణాలు నమోదవ్వడం ఇదే తొలిసారి. అత్యధిక జనభా కలిగిన రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 64వేల కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 44.98లక్షలకు చేరింది. 1.52లక్షల మంది కరోనా కారణంగా మరణించారు.