Begin typing your search above and press return to search.

ఒసామా బిన్ లాదెన్ తనయుడు హతం..కన్ ఫర్మ్ చేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:30 PM GMT
ఒసామా బిన్ లాదెన్ తనయుడు హతం..కన్ ఫర్మ్ చేసిన ట్రంప్
X
ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాదెన్ తనయుడు - ప్రస్తుతం అల్ ఖైదా అధినేతగా ఉన్న హమ్జా బిన్ లాదెన్‌ ను అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ కన్ఫర్మ్ చేశారు. ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జరిపిన కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ లో హమ్జా హతమైనట్లు వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడింది.

హమ్జా అనేక టెర్రరిస్టు కార్యకలాపాలకు సూత్రధారని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే... హమ్జాను ఇప్పుడేమీ హతమార్చలేదని.. గత రెండేళ్లలో ఒకానొక సమయంలో హతమార్చామని వైట్ హౌస్ అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. అంటే... హమ్జాను చాలాకాలం కిందటే మట్టుబెట్టినా తాజాగా ప్రకటించినట్లయింది.

అయితే గత ఏడాది చిట్టచివరి సారిగా హమ్జా నుంచి బహిరంగ ప్రకటనవచ్చింది. ఆ ప్రకటనలో హమ్జా సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలన్నీ తిరగబడాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత ఆయన్నుంచి ఎలాంటి ప్రకటనలు లేవు.

హమ్జా 1989లో జన్మించాడు.. ఆయన జన్మించిన కొన్నాళ్లకు ఒసామా బిన్ లాదెన్ 1996లో ఆఫ్గనిస్తాన్ వచ్చేసి ఉగ్రకార్యకలాపాలకు తెరతీశారు. అమెరికాపై యుద్ధం ప్రకటించారు. ఒసామా విడుదల చేసే వీడియోల్లో హమ్జా కనిపిస్తుండేవాడు. 2001 అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడితో ఒసామా అంటే ప్రపంచానికి వణుకు మొదలైంది.. అమెరికా ఒసామాను వేటాడడం మొదలుపెట్టింది. చివరకు పాకిస్తాన్ లో 2011లో ఒసామాను అమెరికా హతమార్చింది. అనంతరం గత కొన్నేళ్లు హమ్జా ఆల్ ఖైదా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనే ఆల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్నారని గత ఏడాది ఐక్య రాజ్య సమితి కూడా ఒక నివేదికలో ధ్రువీకరించింది. చాలాకాలంగా హమ్జాను వేటాడుతున్న అమెరికా అతన్ని హతమార్చిందని ఇప్పటికే ప్రపంచానికి అనుమానాలుండగా.. తాజా ప్రకటనతో అది కన్ఫర్మయింది.