Begin typing your search above and press return to search.

అడ్డొచ్చిన ఆటార్నీపై ట్రంప్ వేటు

By:  Tupaki Desk   |   31 Jan 2017 6:30 AM GMT
అడ్డొచ్చిన ఆటార్నీపై ట్రంప్ వేటు
X
మొండోడు రాజు కంటే బలవంతుడని చెబుతారు. మరి.. మొండోడే రాజు అయితే..? అన్న డౌట్ అస్సలు అక్కర్లేదు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నట్రంప్ వైపు చూపిస్తే.. అయ్యగారి వైఖరి ఎలా ఉంటుందో ఇట్టే తెలుస్తుంది. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వచ్చే వారిని అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా జారీ చేసిన ఉత్తర్వులపై ఓపక్క దేశంలో నిరసనలు పెద్ద ఎత్తున మిన్నంటుతున్న వేళ.. ట్రంప్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాను జారీ చేసిన నిషేధ ఉత్తర్వుల విషయంలో తనకు సహకరించని అటార్నీ జనరల్ సలే యాట్స్ పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఆమెపై వేటు వేసిన వెంటనే రియాక్ట్ అయిన ట్రంప్.. ‘‘ఒబామా చేత నియమితురాలైన అధికారులు మా పనికి అడుగడుగునా అడ్డు పడుతున్నారు’’ అంటూ ఆమెపై పరోక్షంగా ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వైట్ హౌస్ అధికారులు సమర్థిస్తూ.. అమెరికన్ల ప్రయోజనం కోసం జారీ అయిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను సమర్థించకుండా సలే యాట్స్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని.. అందుకే ఆమెను పదవి నుంచి తొలగించినట్లుగా వారు వ్యాఖ్యానించారు. ముస్లిం మెజార్టీ ఉన్న ఏడు దేశాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్ని ఫెడరల్ కోర్టులు నిలిపివేసిన క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ న్యాయశాఖ తన వాదనల్ని వినిపించాల్సి ఉంది. అయితే.. సలే యాట్స్ మాత్రం ట్రంప్ నిర్ణయానికి అనుకూంగా వాదనలు వినిపించేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. దీంతో.. ఆమె వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ఆమెను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో తాను తీసుకున్ననిర్ణయాలకు అడ్డు పడే వారి విషయంలో తానెంత కఠినంగా వ్యవహరిస్తానన్న విషయాన్ని ట్రంప్ చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/