Begin typing your search above and press return to search.

కాబూలీవాలా వేలు విడిచిన తమ్ముడా ట్రంప్?

By:  Tupaki Desk   |   27 Jan 2017 10:03 AM GMT
కాబూలీవాలా వేలు విడిచిన తమ్ముడా ట్రంప్?
X
ప్రాణం మీదకు వచ్చినా కాబూలీవాలా దగ్గర అప్పు చేయకూడదని చెబుతుండేవారు పాత రోజుల్లో. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. మొండిఘటమైన ఈ 70 ఏళ్ల వృద్ధ అధ్యక్షుడు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనటంలో ఆయనకుఆయనే సాటి. తానేం అనుకున్నాడో అది కాస్తా పూర్తి చేసేందుకు ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన వేళనే.. అమెరికాకు.. మెక్సికోకు మధ్య గోడను నిర్మిస్తానని.. అక్రమ వలసలకు చెక్ పెడతానంటూ పెద్ద పెద్ద మాటలే చెప్పారు. ట్రంప్ గెలిచి.. ఆయనగారు గోడ కట్టాలి కదా అనుకున్నోళ్లకు షాకిచ్చేలా పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పదవీ బాధ్యతలు స్వీకరించిన వారం వ్యవధిలోనే మెక్సికో గోడ యవ్వారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

అమెరికా కట్టే గోడకు తాము డబ్బులు ఇవ్వలేమని మెక్సికో అధ్యక్షుడు ఎన్నిక్ పెనా నీటో తేల్చేశారు. ఇలాంటి మాటలు అన్న వెంటనే ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే అమెరికా.. మెక్సికో మధ్యన గోడ కట్టే ఉత్తర్వుపై సంతకం చేసేసిన ఆయన.. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. గోడ కట్టే ఖర్చులో మెక్సికో వాటాను రాబట్టేందుకు వీలుగా పన్ను పెంపు నిర్ణయంగా భావిస్తున్నారు.

మరోవైపు.. గోడ కట్టేందుకు అయ్యే ఖర్చుకు డబ్బులు చెల్లించని పక్షంలో అమెరికా పర్యటనకు రావాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్వీట్ లో తేల్చేయటంతో.. మెక్సికో అధినేత తన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంటికి వచ్చే అతిధిని డబ్బులు ఇవ్వకపోతే రావొద్దంటూ పెడసరంగా అనేయటం ట్రంప్ కు మాత్రమే చెల్లుతుందేమో. తాజాగా పరిణామాల్ని చూసిన వారికి.. ట్రంప్ కు తీసుకున్న అప్పును వసూలు చేసే విషయంలో కటువుగా వ్యవహరించే కాబూలీవాలాతో ఏదో రిలేషన్ ఉన్నట్లుగా అనిపించట్లేదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/