Begin typing your search above and press return to search.

ట్రంప్ తో లెక్క ఇలానే ఉంటాది.. సీక్రెట్ సర్వీస్ కు చుక్కలు చూపించాడు

By:  Tupaki Desk   |   24 May 2021 5:30 AM GMT
ట్రంప్ తో లెక్క ఇలానే ఉంటాది.. సీక్రెట్ సర్వీస్ కు చుక్కలు చూపించాడు
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి.. అధ్యక్ష పదవిని దిగిపోయే వరకు ఆయన ఎన్నో సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఆయన సంచలనాల పర్వం సాగుతూనే ఉంది. తాజాగా ఆయన తీరుకు సంబంధించిన షాకింగ్ అంశాన్ని తనదైన శైలిలో వెల్లడించింది అక్కడి ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు.

అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్న తర్వాత ట్రంప్.. ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో రిసార్టులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు భద్రతగా.. కొంతమంది సీక్రెట్ సర్వీస్ సిబ్బంది సెక్యురిటీ ఇస్తున్నారు. వారికి కూడా అదే రిసార్టులో బస కల్పించారు. జనవరి నుంచి ఏప్రిల్ 30 మధ్య కాలంలో ఈ సీక్రెట్ సర్వీసుకు సంబంధించిన సిబ్బందికి కల్పించిన బసకు ఏకంగా 40వేల డాలర్ల బిల్లును వేయటం షాకింగ్ గా మారింది. అయితే.. రిసార్టు ట్రంప్ కు చెందింది కావటం గమనార్హం.

రోజుకు 400 డాలర్లు (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 396.15 డాలర్లు) చొప్పున బిల్లు వేసినట్లుగా వాషింగ్టన్ పోస్టు పత్రిక సంచలన కథనాన్ని అచ్చేసింది. ఇందుకోసం అధికారిక పత్రాల్లోని వివరాల్ని వెల్లడించింది. అంతేకాదు.. ట్రంప్ పదవీ కాలంలో ఆయన భద్రత కోసం 2.5 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని సీక్రెట్ సర్వీస్ ఖర్చు చేసినట్లుగా ఈ కథనంలో పేర్కొన్నారు. ట్రంప్ కు ముందు అధ్యక్షులుగా పని చేసిన వారికి అయిన ఖర్చుతో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువని చెబుతున్నారు. అందుకో ఉదాహరణను కూడా చెబుతున్నారు.

ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జో బైడెన్.. 2011 - 2017 మధ్య కాలంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కోసం ఆయన డెలవేర్ లోని తన ఇంట్లో కొన్ని గదుల్ని కేటాయించారు. ఇందుకోసం ఆయన నెలకు 2200 డాలర్లను ఛార్జి చేశారు. ఆరేళ్ల కాలంలోఆయన వేసిన ఛార్జి 1.71లక్షల డాలర్లు కాగా..ట్రంప్ వారు కేవలం మూడు నెలల వ్యవధిలోనే 40వేల డాలర్లను చార్జి చేయటం సీక్రెట్ సర్వీసు వారికి షాకింగ్ గా మారిందని చెబుతున్నారు.