Begin typing your search above and press return to search.

ట్రంప్ః రాన‌నుకున్నారా? రాలేననుకున్నారా??

By:  Tupaki Desk   |   6 Jun 2021 12:30 PM GMT
ట్రంప్ః రాన‌నుకున్నారా? రాలేననుకున్నారా??
X
గ‌తేడాది జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల వేళ ఎంత‌టి ర‌చ్చ జ‌రిగిందో తెలిసిందే. తాను ఓట‌మిని అంగీక‌రించేది లేదంటూ భీష్మించిన ట్రంప్‌.. ఓ ప‌ట్టాన బైడెన్ కు ప‌గ్గాలు అప్ప‌జెప్ప‌లేదు. పార్ల‌మెంట్ భ‌వ‌నంపై ఆయ‌న మ‌ద్ద‌తు దారులు దండెత్త‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. మొత్తానికి అయిష్టంగానే వైట్ హౌస్ నుంచి నిష్క్ర‌మించిన ట్రంప్.. అప్ప‌టి నుంచి జ‌నాల‌కు, మీడియాకు దూరంగానే ఉన్నారు.

ట్విట‌ర్ సంస్థ‌ ట్రంప్ అకౌంట్ ను శాశ్వ‌తంగా ర‌ద్దు చేయ‌డంతో.. ఆయ‌న సోష‌ల్ మీడియాలోనూ లేకుండా పోయారు. ఈ ప‌రిణామాల‌న్నింటితో రాజ‌కీయాల నుంచి ట్రంప్ ప‌క్క‌కు జ‌రిగిపోయిన‌ట్టే అనే అభిప్రాయం ప్ర‌పంచ వ్యాప్తంగా వ్య‌క్త‌మైంది. అయితే.. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చారు ట్రంప్‌. ఆదివారం ఓ ప‌బ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న ఆయ‌న‌.. వ‌చ్చే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీచేయ‌బోతున్నట్టు సంకేతాలివ్వడం గ‌మ‌నార్హం.

వ‌చ్చే ఏడాది నార్త్ క‌రోలినా రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లో గెలుపుకోసం ఉద్దేశించిన ఈ మీటింగ్ లో ట్రంప్ మాట్లాడారు. నార్త్ క‌రోలినాను మ‌నం గెల‌వ‌బోతున్నాం. ఇందుకోసం ఇప్ప‌టి నుంచే క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం. 2024లో మ‌రోసారి కూడా గెలిచి సత్తా చాటుదాం’’ అని అన్నారు.

నార్త్ కరోలినా రాష్ట్రంలో రిపబ్లికన్లదే పైచేయిగా ఉంది. గ‌డిచిన 13 ఎన్నిక‌ల‌ను లెక్క‌లోకి తీసుకుంటే.. ఏకంగా 11 సార్లు రిప‌బ్లిక‌న్లే గెలిచారు. 1976, 2008లో మాత్ర‌మే డెమోక్రాట్లు గెలిచారు. మొన్న ట్రంప్ ఓడిపోయిన‌ప్పుడు కూడా క‌రోలినాలో రిప‌బ్లికన్లే విజ‌యం సాధించ‌డం విశేషం. మొత్తానికి ఈ స‌భ ద్వారా తాను మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాన‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో పోటీకూడా చేస్తాన‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించ‌డం విశేషం.