Begin typing your search above and press return to search.

ట్రంప్ రోజూ రూ.7 లక్షల జరిమానా కట్టాల్సిందే?

By:  Tupaki Desk   |   28 April 2022 2:30 AM GMT
ట్రంప్ రోజూ రూ.7 లక్షల జరిమానా కట్టాల్సిందే?
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన అధ్యక్షుడిగా ఉండగా చేసిన వ్యాఖ్యలు, వివాదాలు అన్నీ ఇన్నీ కావు.ఇప్పటికీ ఏదో ఒకటి రాజేస్తూ వివాదాలను పెంచి పోషిస్తూనే ఉంటాడు. తరచూ వార్తల్లో నిలిచే డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించే వరకూ ప్రతిరోజు సుమారు రూ.7 లక్షల వరకూ జరిమానా కట్టాలని ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తి ఎంగోరోన్ మాట్లాడుతూ.. ‘2019 విచారణలో ట్రంప్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ఆస్తుల విలువను తప్పుగా చూపించడమే కాకుండా అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమవ్వడంతోనే జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు.

అందువల్ల ట్రంప్ మంగళవారం నుంచే రోజువారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు తెలిపారు. గోల్ఫ్ క్లబ్ లు, పెంట్ హౌస్ అపార్ట్ మెంట్ తో సహా ఆస్తుల విలువలను దర్యాప్తులో తప్పుగా పేర్కొన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.

అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో ఆస్తులపై మంచి రుణాలు పొందడం కోసం వాటి విలువను అధికంగా చూపించారని.. మరికొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలను పొందడం కోసం వాటి విలువనే తక్కువగా కూడా చూపించారని పేర్కొన్నారు.

వాస్తవానికి ట్రంప్ గతంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. కానీ ఆయన తరుఫున న్యాయవాదులు అభ్యర్థన మేరకు కోర్టు మార్చి 31 వరకూ గడువు ఇచ్చింది.

అయితే ట్రంప్ తరుఫు న్యాయవాది అలీనా హబ్బా విచారణ అనంతరం ఈ విషయమై అప్పీలు చేస్తానని చెప్పడం గమనార్హం.