Begin typing your search above and press return to search.

ట్రంప్ ఇండియా టూర్ కన్ఫర్మ్

By:  Tupaki Desk   |   28 Jan 2020 5:30 AM GMT
ట్రంప్ ఇండియా టూర్ కన్ఫర్మ్
X
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే నెల మూడో వారంలో ఆయన మూడు రోజుల పాటు భారత్ లో ఉండనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్యలో భారత్ లో ట్రంప్ పర్యటిస్తారని చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి రానున్న ఆయన.. ఐటీసీ మౌర్య హోటల్ లో ఆయన బస చేయనున్నట్లు చెబుతున్నారు. ఆయన కోసం ప్రెసిడెన్షియల్ సూట్ ను బుక్ చేసినట్లుగా అమెరికా ప్రకటించింది.

తాజా పర్యటనతో పలు ఒప్పందాల మీద భారత్ - అమెరికా మధ్య సంతకాలు జరుగుతాయని చెబుతున్నారు. పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్.. అఫ్ఘనిస్తాన్.. ఇరాన్ ప్రాంతాల్లో పెరుగుతున్న తీవ్రవాదం గురించి కూడా చర్చలు జరుపుతారని చెబుతుననారు. తమకున్న వాణిజ్య లోటును తగ్గించుకోవటానికి భారత్ ఆరు బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా భావిస్తోంది.

అందుకు ప్రతిగా చమురు లేదంటే షేల్ గ్యాస్ మీద హామీ పొందాలన్న ఆలోచనలో భారత్ ఉన్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ మీద మాటల యుద్ధం చేసేందుకు దాయాది పాక్ సిద్ధమవుతున్న వేళ.. ట్రంప్ పర్యటన ఆసక్తికరంగా మారింది.

తన పర్యటనలో ట్రంప్ అహ్మదాబాద్ లో ప్రధాని మోడీతో చర్చలు జరిపే వీలుందని చెబుతున్నారు. అగ్ర రాజ్యాలకు చెందిన అధినేత దేశ పర్యటనకు వచ్చినప్పుడు.. దేశంలోని కొత్త ప్రదేశాల్లో వారితో సమావేశమయ్యే ప్రధాని మోడీ.. ఈసారి ట్రంప్ పర్యటనకు తాను ప్రాతినిధ్యం వహించే గుజరాత్ రాష్ట్రాన్ని ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ టూర్ ప్లాన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.