Begin typing your search above and press return to search.

ట్రంప్‌ సంచలన నిర్ణయం..సలహాదారులుగా భారతీయుల నియామకం

By:  Tupaki Desk   |   15 April 2020 1:30 PM GMT
ట్రంప్‌ సంచలన నిర్ణయం..సలహాదారులుగా భారతీయుల నియామకం
X
ప్రస్తుతం కరోనా వైరస్‌ తో తీవ్రంగా ప్రభావితమవుతున్న అమెరికా దేశం ప్రమాదంలో పడింది. ఆ దేశం ఏనాడు లేనంతగా కోలుకోని విధంగా నష్టపోతున్నది. లక్షల సంఖ్యలో కరోనా కేసులు - వేల సంఖ్యలో మృతులు ఉండడంతో ఆ దేశం చిగురుటాకులా వణుకుతోంది. ఈ సమయంలో తిరిగి అమెరికా నిలబడాలంటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ అదుపులోకి రావడానికి ఇప్పటి నుంచే ఆ దేశ అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఆ దేశంలో కరోనా అదుపులోకి రాక మునుపే భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ అగ్రస్థానంలో నిలబడేలా సలహాలు - సూచనలు ఇవ్వాలని కొందరిని తన సలహాదారులుగా నియమించుకున్నారు. అయితే భారతదేశానికి చెందిన ప్రముఖులు ఉన్నారు.

తమ ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేందుకు ఏం చేయాలనే దానిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ - మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు సలహాలు సూచనలు ఇవ్వాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా తన అధికారిక నివాసం వైట్ హౌజ్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేలా ట్రంప్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తనకు సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామికవేత్తలు - నిపుణులను కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయం - బ్యాంకింగ్ - నిర్మాణం - రక్షణ - ఇంధన - ఆర్థిక సేవలు - ఆహార ఉత్పత్తులు - ఆరోగ్యం - సేవలు - పారిశ్రామిక రంగం - రిటైల్ - టెక్నాలజీ - టెలి కమ్యూనికేషన్ - రవాణా తదితర రంగాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనో - ఎలాంటి నిర్ణయాలు అమలు చేయాలో తెలిపేందుకు వారందరినీ ఎంపిక చేశారు.

ఆయా అంశాలపై ఆయా రంగాలకు చెందిన వారు అధ్యక్షుడు ట్రంప్‌ నకు సూచనలు చేయనున్నారు. తాను ఎంపిక చేసిన వారిలో వారి వారి రంగాల్లో ప్రతిభావంతులు - ఉన్నతంతా ఉన్నవారని ట్రంప్‌ చెబుతూ తమ దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు వారు కొత్త కొత్త సలహాలు ఇస్తారు అని ట్రంప్ తెలిపారు. ఆ విధంగా సలహాదారులుగా నియమితులైన వారిలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ - ఫేస్‌ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌ బర్గ్ - టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ నియమితులు కాగా వారితో పాటు భారతదేశానికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెళ్ల - గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ - భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్ట (ఐబీఎమ్) - సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్) తదితరులు ట్రంప్‌ సలహదారులుగా నియమితులయ్యారు. సలహాదారుల్లో మొత్తం భారత సంతతికి చెందిన ఆరుగురు ప్రముఖులకు స్థానం లభించడం విశేషం.