Begin typing your search above and press return to search.

హెచ్ 1బీపై ట్రంప్ యాక్షన్ ప్లాన్ చెప్పిన ప్రవాసీ

By:  Tupaki Desk   |   3 Feb 2017 4:36 AM GMT
హెచ్ 1బీపై ట్రంప్ యాక్షన్ ప్లాన్ చెప్పిన ప్రవాసీ
X
ఏడు ముస్లిం మెజార్టీ దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిపై పరిమితులు విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తన తర్వాతి అడుగ్గా హెచ్ 1బీ విషయంలో ఒక చూపు చూస్తారన్న వాదన వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అదే జరిగితే భారత ఐటీ జీవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అలాంటిదేమీ ఉండదంటూ ఊరట మాటను చెబుతున్నారు ట్రంప్ కి బలమైన మద్దతుదారు.. ప్రవాస భారతీయుడైన శలభ్ కుమార్.

అమెరికా అధ్యక్షుడు తీసుకోనున్న నిర్ణయాలతో భారతీయ ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. వీసా కట్టడికి ఎలాంటి ప్లాన్లు లేవని.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే ఐటీ ముఖ్య పాత్ర పోషించాల్సి ఉందన్నారు. అమెరికాకు మరింత మంది ఐటీ నిపుణులు కావాలని.. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగాల్లో తీవ్రకొరత ఉందని.. ఆ ఖాళీల్ని భారత ఐటీ నిపుణులతో భర్తీ చేస్తారని చెప్పుకొచ్చారు.

గ్రీన్ కార్డులను ఇష్యూ చేయటంలో దేశాల వారీ కోటాను వైట్ హౌస్ రద్దు చేస్తున్నట్లుగా తాను విశ్వసిస్తానని.. దీని వల్ల భారత ఐటీ నిపుణులకు మేలు జరుగుతుందన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. హెచ్ 1బి వీసాలకు సంబంధించి సంస్కరణల కోసం ట్రంప్ సర్కారు ఎలాంటి ఆర్డినెన్స్ ను జారీ చేయలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. భారతీయుల అవకాశాల్ని దెబ్బ తీసేలా ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ తరహా వ్యాఖ్యలు ఊరటనిచ్చేలా ఉన్నాయని చెప్పాలి. భారతీయుల విషయంలో ట్రంప్ వైఖరి భిన్నంగా ఉంటుందా? అన్నది కాలం మాత్రమే సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/