Begin typing your search above and press return to search.

పార్టీ ఆఫీసుపై బాంబు దాడి.. ట్రంప్ ఫైర్!

By:  Tupaki Desk   |   17 Oct 2016 6:59 AM GMT
పార్టీ ఆఫీసుపై బాంబు దాడి.. ట్రంప్ ఫైర్!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అమెరికాలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.. వేడెక్కడమే కాదు పేళుతున్నాయి కూడా! అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తోన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు. ఈ అంశం అమెరికాను కుదిపేస్తోంది. ఇప్పటికే అమెరికాలో రాజకీయాలతో ట్రంప్ - హిల్లరీ మాటల వేడి రాజుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘ్టన జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన రిపబ్లికన్ పార్టీ ఈ సంఘటనను "రాజకీయ ఉగ్రవాదం"గా అభివర్ణించింది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారు. ఈ విషయలపై స్పందించిన పోలీసులు... కిటికీ గుండా ఆఫీసు లోపలికి బాంబులు విరిసారని, పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నీచర్ తోపాటు ప్రచార సామాగ్రి కూడా మొత్తం కాలిపోయిందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ఘటనా స్థలానికి అతి సమీపంలో మూసి ఉన్న ఒక షెట్టర్ పై "నాజీ రిపబ్లికన్లారా... ఇక్కడి నుంచి వెళ్లిపొండి. లేకుంటే..." అని రాసిఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ సంఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నట్లయ్యింది.

ఈ చర్యను అమెరికా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా నార్త్ కరొలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ పేర్కొనగా... డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ బాంబు దాడిని ఖండించి, ఈ దాడిలో ప్రాణనష్టం జరగనందుకు సంతోషిస్తున్నానంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ అంశంపై ఆ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వరుసగా ట్వీట్లు చేశారు. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన ట్రంప్ మరోసారి నోటికి పనిచెప్పారు.. "హిల్లరీని సమర్ధితోన్న జంతువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి" అని అన్నారు. ఎన్నికల్లో కీలకమైన ఉత్తర కరొలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని.. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందన్న అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని.. బాంబు దాడి ఘటనను ఎన్నటికీ మర్చిపోమని ట్రంప్ పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/