Begin typing your search above and press return to search.

ఇందుకే మ‌నం ట్రంప్‌ ను గౌర‌వించాలి

By:  Tupaki Desk   |   24 Feb 2019 1:25 PM GMT
ఇందుకే మ‌నం ట్రంప్‌ ను గౌర‌వించాలి
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుఎంత వెర్రి ఉన్న‌ప్ప‌టికీ... కొన్ని విష‌యాల్లో ఆయ‌న లెక్క‌కో తిక్క ఉంటుంద‌ని అనిపిస్తుంది. తాజాగా అదే నిజ‌మ‌నిపిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా స్పందించిన తీరు ఇందుకు నిద‌ర్శ‌నంగా పేర్కొన్నారు. దాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోవడంతో, బలంగా బదులివ్వాలన్న భారత్ ఆకాంక్షను తాను అర్థం చేసుకోగలగని వ్యాఖ్యానించారు. చిత్రంగా ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేసింది మ‌న ప‌క్క‌లో బ‌ల్లెం లాంటి చైనా స‌మ‌క్షంలో.

జ‌మ్ము కశ్మీర్‌ లోని పుల్వామాలో ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ దాడి భయానకమైనదని అభివర్ణించారు. మరోవైపు ఉగ్రవాదంపై పోరులో అమెరికా విదేశాంగ శాఖ భారత్‌కు పూర్తి మద్దతును ప్రకటించారు. పుల్వామా దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పాకిస్థాన్‌ కు సూచించారు. చైనా వాణిజ్య ప్రతినిధి బృందంతో సమావేశమైన అనంతరం వైట్‌ హౌస్‌ లోని ఓవల్ ఆఫీస్‌ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌ లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. బలంగా ఏదైనా చేయాలని భారత్ చూస్తున్నది. ఉగ్రదాడిలో భారత్ దాదాపు 50 మందిని కోల్పోయింది. దాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు సద్దుమణగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్థాన్‌ కు ఇదివరకు అందజేస్తున్న 1.3 బిలియన్ డాలర్ల సాయాన్ని తాము నిలిపివేశామని, అయినప్పటికీ ఆ దేశంతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

మరో మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వానికి తమ సానుభూతి తెలపడమే కాకుండా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం అని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నీచమైన చర్యకు పాల్పడిన నేరస్తుడు పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిగా పేర్కొన్నాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇవ్వకూడదన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను పాటించడంలో తమ బాధ్యతలను గుర్తెరగాలని అన్ని దేశాలను కోరుతున్నాం అని రాబర్ట్ పేర్కొన్నారు. అన్ని దేశాలను ఉద్దేశించి చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నా, ప్రత్యేకించి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ ను, దానికి మద్దతుగా నిలుస్తున్న చైనాను ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఘటనకు సంబంధించి విచారణకు పాకిస్థాన్ పూర్తి సహకారం అందించాలని, బాధ్యులైన వారిని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.