Begin typing your search above and press return to search.

నేనే లేకుంటే.. 10 కోట్ల మంది చచ్చేవారు.. ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   9 Aug 2021 2:33 PM GMT
నేనే లేకుంటే.. 10 కోట్ల మంది చచ్చేవారు.. ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ ఎవ‌రైనా ఉంటే.. అది అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంపే. ఆయ‌న ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. వివాదాల‌కు ఆజ్యం పోస్తూనే ఉంటుంది. అయితే.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తించేవారు కూడా ఉన్నారు. ప‌ర‌నింద చేయ‌డంలోను.. సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డంలోనూ ట్రంప్ ను మించిన నాయ‌కుడు లేర‌ని అమెరికా రాజ‌కీయ విశ్లేష‌కులు త‌ర‌చుగా చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు.. మ‌రోసారి.. ఈ వ్యాఖ్య‌ల‌ను రుజువు చేస్తున్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా మ‌హ‌మ్మారి అగ్ర‌రాజ్యాన్ని ఏ విధంగా కుదిపేసిందో అంద‌రికీ తెలిసిందే. ట్రంప్ హ‌యాంలో గ‌త ఏడాది.. అమెరికా చివురుటాకులా ఒణికి పోయింది.

అయితే.. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే.. తానే క‌నుక అప్ప‌ట్లో నిర్ణ‌యాలు తీసుకుని ఉండ‌క‌పోతే.. అమెరికాలో 10 కోట్ల మంది చ‌చ్చిపోయి ఉండేవార‌ని చెబుతున్నారు. అంటే.. అమెరికా వాస్త‌వ జ‌నాభా 33 కోట్ల మంది అయితే.. దీనిలో 10 కోట్లు అంటే.. దాదాపు స‌గం మంది చ‌చ్చిపోయేవార‌న్న‌మాట‌. కానీ, అప్ప‌ట్లో ట్రంప్ వైఖ‌రిని గ‌మ‌నిస్తే.. మాస్కులు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఇలా ఒత్తిడి చేయ‌డం అంటే.. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మేన‌ని వితండ వాదం చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఒక‌వైపు రాష్ట్రాల‌కు రాష్ట్రాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుంటే.. మ‌రోవైపు.. ట్రంప్‌.. పార్టీలు చేసుకున్నారంటూ.. అగ్ర‌రాజ్యం మీడియా.. దుమ్మెత్తి పోసిన ఉదంతం ఇప్ప‌టికీ.. ప్ర‌పంచం క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది.

కానీ, ట్రంప్ మాత్రం.. తానే లేక‌పోతే.. అంటూ.. తాజాగా వ్యాఖ్య‌లు గుప్పించారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల కార‌ణంగానే అమెరికాలో మ‌ర‌ణాల సంఖ్య‌ను త‌గ్గించ‌గ‌లిగామ‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం 200 మిలియ‌న్ డోసుల ఫైజ‌ర్‌, 200 మిలియ‌న్ డోసుల మోడెర్నా టీకాల‌కు ఆర్డ‌ర్లు ఇచ్చింద‌ని గుర్తు చేశారు. స‌కాలంలో ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించ‌డం వ‌ల‌నే ఇప్పుడు మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఏమాత్రం ఆల‌స్యం చేసినా 10 కోట్ల మంది అమెరిక‌న్ల ప్రాణాలు పోయేవ‌ని అన్నారు. చైనా నుంచి క‌రోనా వ‌చ్చింద‌ని అనేక సంద‌ర్భాల్లో ట్రంప్ చెబుతూ వ‌చ్చారు. ల్యాబ్ నుంచి వైర‌స్ లీకైన‌ట్టు ఆయ‌న గ‌తంలో ప‌లుమార్లు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడు ట్రంప్ మ‌రోసారి.. మ‌రోసారి సెంట‌రాఫ్ ది టాపిక్ అయ్యారు.