Begin typing your search above and press return to search.
ఇక హాయిగా నిద్రపోవచ్చంటున్న ట్రంప్
By: Tupaki Desk | 13 Jun 2018 12:48 PM GMTనార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో చారిత్రక భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎవరైనా చేస్తారు.. కానీ అత్యంత ధైర్యశాలులే శాంతి కోసం ప్రయత్నిస్తారని ట్రంప్ అన్నారు. మేం కొత్త చరిత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాం.. గతమే ఎప్పుడూ భవిష్యత్తును నిర్మించదు.. ప్రపంచ చరిత్రలోని అత్యంత గొప్ప రోజుల్లో ఇదీ ఒకటి అని ట్రంప్ స్పష్టం చేశారు. కిమ్ జాంగ్ ఉన్ తో చారిత్రక భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ లో ల్యాండయ్యారు. అనంతరం ఆయన పలు ఆసక్తికర ట్వీట్ లు చేయడం గమనార్హం
` ఇప్పుడే దిగాను.. చాలా లాంగ్ ట్రిప్.. కానీ నేను అధ్యక్ష పదవి చేపట్టనప్పటి కంటే ఇప్పుడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. నార్త్ కొరియా నుంచి మనకు ఇక అణు ముప్పు లేదు. కిమ్ జాంగ్ ఉన్‌తో సమావేశం చాలా ఆసక్తిగా, సానుకూలంగా సాగింది. నార్త్ కొరియాకు మంచి భవిష్యత్తు ఉంది` అని ట్రంప్ మొదట ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ఐదు నిమిషాల వ్యవధిలో దీనికి సంబంధించే మరో ట్వీట్ చేశారు. `నేను అధ్యక్ష పదవి చేపట్టక ముందు చాలా మంది మనం ఉత్తర కొరియాతో యుద్ధం చేయబోతున్నామన్న భావనలో ఉన్నారు. నార్త్ కొరియానే మనకు అతిపెద్ద, ప్రమాదకర సమస్య అని అప్పటి అధ్యక్షుడు ఒబామా అన్నారు. కానీ ఇక అది ఏమాత్రం సమస్య కాదు. ఇక హాయిగా నిద్రపోవచ్చు` అని ట్రంప్ అన్నారు.
కాగా, సింగపూర్ భేటీలో ఈ ఇద్దరు నేతలు మాట్లాడిన సందర్భంగా సైతం ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అణు నిరాయుధీకరణ మొదలు పెట్టిన తరువాత నార్త్ కొరియాపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని, దానికోసం తాను ఎదురుచూస్తున్నానని ట్రంప్ తెలిపారు. ``ఈ సమావేశం ఇటు అమెరికాకు - అటు నార్త్ కొరియాకు చాలా ముఖ్యమైనది. ట్రంప్ ను ద్వేషించేవాళ్లే దీనిని వ్యతిరేకించారు. కానీ రెండు దేశాల కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం అని ట్రంప్ స్పష్టంచేశారు. ఇక ఇవాళ్టి సమావేశం తర్వాత కొరియా ద్వీపకల్పంలో అమెరికా మిలిటరీ కసరత్తులు ఉండబోవు` ట్రంప్ కీలక ప్రకటన చేశారు.