Begin typing your search above and press return to search.

చికిత్స మధ్యలో ఆసుపత్రి నుంచి బయటకొచ్చిన ట్రంప్

By:  Tupaki Desk   |   5 Oct 2020 8:30 AM GMT
చికిత్స మధ్యలో ఆసుపత్రి నుంచి బయటకొచ్చిన ట్రంప్
X
కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య చర్యను ప్రదర్శించారు. తీవ్ర అనారోగ్యంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న వేళ.. తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి కాసేపు బయటకు వచ్చి సందడి చేశారు. కారులో ఆసుపత్రి ఆవరణలో చక్కర్లు కొట్టిన ఆయన.. తన కోసం బయట ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు.

అమెరికా జాతీయ జెండా పట్టుకొని ఉత్సాహపరుస్తున్న తన మద్దతుదారులకు అభివాదం చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. చేతితో ఇచ్చిన సంకేతాలతో స్పష్టం చేసిన ఆయన.. వాల్టర్ రీడ్ ఆసుపత్రి ప్రాంగణంలో కాసేపు తిరిగారు. కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన.. బయటకు వచ్చి పెద్ద రిస్కు చేసినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

ఆసుపత్రి బయట తనకోసం ఎదురుచూస్తున్న అభిమానులను తాను ఆశ్చర్యంలో ముంచెత్తబోతున్నట్లుగా ట్వీట్ చేసిన ఆయన.. తాను చెప్పినట్లే ఆసుపత్రి నుంచి బయటకు కారులో వచ్చి.. అందరిని సర్ ప్రైజ్ చేశారు. ఈ చర్యను పలువురు తప్పు పడుతున్నారు. ఇలా ఆసుపత్రి నుంచి బయటకు రావటం కరోనా నిబంధనలకు విరుద్దమని విమర్శిస్తున్నారు.

కోవిడ్ గురించి తాను చాలా తెలుసుకున్నానని.. అంతకు ముందు విడుదల చేసిన వీడియోలో చెప్పిన ఆయన.. నిజంగానే తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న వారికి ధైర్యం చెప్పాలనుకుంటే వీడియో ద్వారా సందేశాన్ని ఇస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ట్రంప్ చర్యను పలువురు తప్పు పడుతున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నది పలువురి వాదన. తన కోసం ఆసుపత్రి బయట నిరీక్షిస్తున్న వారంతా దేశ భక్తులగా ట్రంప్ కీర్తించటం గమనార్హం.