Begin typing your search above and press return to search.

నాకేందుకు నీ స‌ల‌హా అంటూ ట్రంప్ ఫైర్‌

By:  Tupaki Desk   |   12 Aug 2017 4:56 PM GMT
నాకేందుకు నీ స‌ల‌హా అంటూ ట్రంప్ ఫైర్‌
X
అమెరికాకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా బెదిరింపులు ఆపకపోతే ప్రపంచం మునుపెన్నడూ చూడని రీతిలో తమ ఉగ్రరూపాన్ని చూడాల్సి వస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఉత్తర కొరియా ఘాటుగా స్పందించి...తమపై దాడి జరుగుతున్నట్టు ఏ మాత్రం సంకేతాలు అందినా అమెరికా నడిబొడ్డునదాడి చేస్తామని ఉత్తరకొరియా హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌గులుకుంటున్న వేడిని చ‌ల్చార్చేందుకు డ్రాగ‌న్ కంట్రీ చైనా రంగంలోకి దిగింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ రంగంలోకి దిగి అధ్యక్షుడు ట్రంప్‌ కు ఫోన్‌ చేసి కూల్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే చైనా అధ్య‌క్షుడి స‌ముదాయింపు చ‌ర్య‌ల‌కు ట్రంప్ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చారు.

ట్రంప్‌ కు సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌, ఉత్త‌ర కొరియాతో నెల‌కొన్న గ్యాప్‌ ను సెటిల్ చేసుకునే ఎజెండాతో రంగంలోకి దిగిన జిన్‌ పింగ్... ఉత్తర కొరియాతో సమస్యను చర్చలు - రాయబారాలు - రాజకీయంగా పరిష్కరించుకోవాలే తప్ప యుద్ధం ద్వారా కాదని అమెరికా అధ్య‌క్షుడికి ఫోనోలో సూచించారు. కొరియా ద్వీపంలో అణు పరీక్షలు జరగకుండా అణ్వాయుధాల ఉత్ప‌త్తి లేకుండా తటస్థీకరించడమే అమెరికా-చైనా అజెండా అని ఈ సంద‌ర్భంగా జిన్‌పింగ్ అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు ఆ దేశ మీడియా వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో అమెరికా మ‌రింత కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న సూచించిన‌ట్లు స‌మాచారం. అయితే ఇంత కూల్‌ గా త‌న స‌యోధ్య ప్ర‌తిపాద‌న‌ల‌ను జిన్‌ పింగ్ ప్ర‌స్తావించ‌గా....ఆయ‌న‌పై ట్రంప్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ యుద్ధ వాతావ‌ర‌ణానికి ఉత్త‌ర‌కొరియా మూల‌మ‌ని...త‌మ‌కు చెప్పే ముందు ఉత్త‌ర‌కొరియాకు చెప్పాల‌ని పేర్కొన‌ట్లు తెలుస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ దూకుడు కార‌ణంగానే తాము సైతం అదే రీతిలో వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తోంద‌ని ట్రంప్ తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం.

కాగా, ఉత్తరకొరియా ఇక ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా సహించేది లేదని ట్రంప్ ఈ ఫోన్ సంభాష‌ణ‌కు ముందు హెచ్చరించారు. తమ గురించి తప్పుడు అంచనాలు వేయవద్దని స్పష్టం చేశారు. తమ దేశాధ్యక్షుడు ఉత్తరకొరియాకు అర్థమయ్యే భాషలో ఘాటైన సందేశం పంపారని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌ సన్ అన్నారు. ఉత్తరకొరియా వాగాడంబరం రోజురోజుకూ పెరుగుతున్నదని, దాని బెదిరింపులు పెచ్చుమీరుతున్నాయని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ కు దౌత్య పరిభాష అర్థం కావడం లేదని, అందుకే ఆయనకు అర్థమయ్యే రీతిలో ట్రంప్ సందేశం పంపారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, తమ అణ్వాయుధాల అమ్ములపొది ఇప్పుడు ఎంతో పటిష్ఠంగా, మునుపెన్నడూ లేనంత శక్తిమంతంగా ఉన్నదని ట్రంప్ ట్వీట్ చేశారు. తమకున్న ఈ శక్తిని ఎన్నటికీ ఉపయోగించబోమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తామెప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశంగా ఉంటామని పేర్కొన్నారు. ఉత్తర కొరియా ఇప్పటికైనా అణ్వాయుధాల అన్వేషణ నుంచి వెనక్కు తగ్గాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ సూచించింది. తమను తాము ఒంటిరిని చేసుకొనే చర్యలను నిలిపివేయాలని, అణ్వాయుధాల ప్రయోగాల నుంచి వెనక్కు తగ్గాలని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ చెప్పారు.