Begin typing your search above and press return to search.

3వ తరగతి విద్యార్థి హత్య.. కలిచివేసే నిజాలు

By:  Tupaki Desk   |   8 Aug 2019 11:45 AM GMT
3వ తరగతి విద్యార్థి హత్య.. కలిచివేసే నిజాలు
X
30 ఏళ్ల కిందట మాట. ప్రతీ ఇంట్లో నానమ్మలు, తాతయ్యలు ఉండేవారు. మనవళ్లను, మనవరాళ్లను తీర్చిదిద్దేవారు. సన్మార్గంలో పయనించేలా జాగ్రత్తలు తీసుకునే వారు.కుటుంబ బంధాలను కథలు కథలుగా చెప్పేవారు.కానీ ఇప్పుడు ఆ వ్యవస్థే లేదు.

తల్లిదండ్రులు గ్రామాల్లో వారి పిల్లలు ఉద్యోగాల వేటలో ఎక్కడో పనిచేస్తూ సిటీల్లో బతుకీడుస్తున్నారు. వారి పిల్లలు మరెక్కడో హాస్టళ్లలో చదువుతున్నారు. దీంతో వారికి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లేకుండా పోతున్నాయి. సున్నితత్వం లోపించి పిల్లల మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తున్నాయి. సినిమాలు, సమాజ పోకడలతో తెలిసి తెలియని వయసులోనే నేరప్రవృత్తి పెరిగిపోతుంది. దీన్ని తగ్గించేలా తల్లిదండ్రులు దగ్గర లేకపోవడం.. తాతలు, నాయనమ్మలు లేకపోవడంతో మరింత చెడిపోతున్నారు. ఇది అంతిమంగా విద్యార్థులను కరుడుగట్టిన వారిగా తయారు చేస్తోంది.

ప్రపంచంలోనే కుటుంబ వ్యవస్థకు ఆలవాలమైన భారత్ లో ఇప్పుడు ఆ వ్యవస్థ కుదేలైంది. అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు ఉద్యోగాల్లో ఉంటే పిల్లలు హాస్టల్లలో ఉంటూ విపరీత పోకడలు, మనస్తత్వాలతో బతుకుతున్నారు..

తాజాగా కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థిని అదే పాఠశాలలో చదివే పదోతరగతి విద్యార్థిని అతి క్రూరంగా గొంతుకోసి చంపాడు. చిన్నపాటి వాగ్వాదం ఈ దారుణానికి ఉసిగొల్పిందని తెలిసి అందరూ షాక్ అయ్యారు. పదోతరగతి విద్యార్థి నేరప్రవృత్తి, మనస్తత్వం క్రూరంగా మారడానికి సినిమాలు, సోషల్ మీడియాల్లో ప్రసారమవుతున్న హింసాత్మక దృశ్యాలే కారణమని.. ఇవి వారి మానసిక స్థితిలో మార్పును తీసుకొచ్చాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి చూసే ఇలా విద్యార్థులు తయారవుతారని అధ్యయనాల్లో తేలిందని చెబుతున్నారు. బ్లూవేల్ గేమ్స్ - సినిమాల్లో హింస- నిజమైన క్రైమ్ సీన్లు చూసి విద్యార్థులు చెడిపోతున్నారని వివరిస్తున్నారు.

చల్లపల్లిలో మూడో తరగతి విద్యార్థిని చంపిన పదోతరగతి విద్యార్థి సినీ ఫక్కీలో తప్పించుకోవడం వెనుక ఇవన్నీ కారణమని పోలీసులు తేల్చారు. హత్య చేసిన తరువాత చాకు కడగడం.. దుస్తులను బ్యాగులో దాచడం.. అమయాకుడిలా నటించడం చూస్తే సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం అతడిపై ఎంతలా ప్రభావం చూపిందో అర్థమవుతోందంటున్నారు. పిల్లలు ఇలా మారడానికి వారికి సరైన వాతావరణం, తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయతలు దక్కకపోవడం కారణంగా మానసిక నిపుణులు సూచిస్తున్నారు.