Begin typing your search above and press return to search.

బాబు చెప్పిన నిజం : రఘురామ మీద హత్యాయత్నం...?

By:  Tupaki Desk   |   22 July 2022 2:22 PM GMT
బాబు చెప్పిన నిజం : రఘురామ మీద హత్యాయత్నం...?
X
నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు మీద హత్యా యత్నం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన అరోపణలు చేశారు. ఆయన పశ్చిమ గోదావారి జిల్లాల పర్యటనలో భాగంగా పాలకొల్లులో పర్యటిస్తూ ఈ హాట్ కామెంట్స్ చేశారు. రఘురామను హత్య చేసి ఆ నేరాన్ని మరోకరి మీద నెట్టేయాలనుకున్నారని వైసీపీ నేతల మీద నిప్పులు చెరిగారు.

ఇక సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మీద దారుణ హత్య జరిగితే ఆ నేరాన్ని కూడా టీడీపీ మీద వేశారని గుర్తు చేశారు. తప్పుడు పనులు చేసేవారిని తాము ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో గోదావరికి వరదలు వస్తే జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదని చంద్రబాబు విమర్శించారు.

ఆయన హెలికాప్టర్ లో గాలిలో తిరుగుతున్నారని అన్నారు. అదే టీడీపీ సర్కార్ అయితే తుపాను వస్తే అక్కడే ఉండి క్షేత్ర స్థాయిలో అన్నీ పరిశీలించేదని ఆయన చెప్పారు. జగన్ కి మానవత్వం లేదని అన్నారు. ఇలాంటి వారు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడానికి అర్హులా కాదా అన్నది ప్రజలే తేల్చుకోవాలని బాబు సూచించారు.

గోదావరి వరదలకు పోలవరం ప్రాజెక్ట్ కొట్టుకుని పోయిందని చంద్రబాబు మరో తీవ్ర ఆరోపణ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఈ పాటికి అంతా బాగుండేదని, వరదలు కూడా ఇలా పెద్ద ఎత్తున వచ్చేవి కావని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వరదలు వచ్చి ఊళ్ళ మీదకు భారీగా నీళ్ళు వస్తే ప్రజలే ఇసుక బస్తాలను అడ్డం పెట్టి తమ ప్రాణాలను కాపాడుకున్నారు తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన దుయ్యబెట్టారు.

మొత్తానికి గోదావరి జిల్లా పర్యటనలో ఆయన రఘురామ పేరెత్తి హత్యాయత్నం జరిగింది అని చెప్పడం సంచలనంగానే చూస్తున్నారు. ఇప్పటిదాకా రఘురామ మాత్రమే తనను చంపబోయారని ఆరోపించేవారు.

ఇపుడు ఒక బలమైన పార్టీ నుంచి అందునా టీడీపీ నుంచి ఆయనకు మద్దతు దక్కింది. మరి రఘురామను హత్య చేయబోయారని బాబు లాంటి సీనియర్ చెప్పిన మీదట అది ఏపీలో అతి పెద్ద చర్చగానే సాగడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.