Begin typing your search above and press return to search.

రాజకీయ పార్టీల‌కు విరాళాలు.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ నిజాలు!

By:  Tupaki Desk   |   8 Sep 2022 9:30 AM GMT
రాజకీయ పార్టీల‌కు విరాళాలు.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ నిజాలు!
X
ఎన్నికల కమిషన్‌ వద్ద న‌మోదై గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు సెప్టెంబ‌ర్ 7న బుధ‌వారం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో ముప్పేట దాడులు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఆదాయ లెక్కలు చూప‌క‌పోవ‌డం, విరాళాల వివ‌రాలు అందించ‌క‌పోవ‌డంతో ఈ దాడులు చేవారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేథోమథన సంస్థ సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌(సీపీఆర్‌), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్‌ అండ్‌ పబ్లిక్‌-స్పిరిటెడ్‌ మీడియా ఫౌండేషన్‌(ఐపీఎస్‌ఎంఎఫ్‌)లపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. దీంతోపాటు.. ఢిల్లీ, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర, ఛ‌త్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని 20 దాకా రాజ‌కీయ పార్టీలు, కర్ణాటకలోని మణిపాల్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన 20 ప్రాంతాల్లోని ఆస్పత్రులు, కార్యాలయాలపై ఐటీ సోదా లు కొనసాగాయి.

ఐటీ శాఖ దాడుల్లో దేశంలోని రాజకీయ పార్టీల బాగోతం మరోసారి తేట‌తెల్ల‌మైంద‌ని స‌మాచారం. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో పలు రాజకీయ పార్టీల విరాళాల గుట్టు రట్టు అయ్యింద‌ని అంటున్నారు. రాజకీయ పార్టీలకు విరాళాల పేరిట కోట్లాది రూపాయలను త‌ర‌లించార‌ని వెల్లడైంది. ఐటీ శాఖ జరిపిన దాడుల్లో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. దేశంలోని రాజకీయ పార్టీలకు మురికివాడలు, చిన్న దుకాణాలు, ఫ్లాట్ల నుంచి కూడా విరాళాలు రావ‌డం గ‌మ‌నార్హం.

ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నగరంలోని వాచ్ రిపేర్ షాపు కేంద్రంగా నడుస్తున్న ఓ గుర్తింపు లేని రాజకీయ పార్టీకి గత మూడేళ్లుగా రూ.370 కోట్ల విరాళాలు అందాయని ఐటీ శాఖ‌ అధికారుల దాడుల్లో తేల‌డం గ‌మ‌నార్హం. దీంతో ఐటీ అధికారులు ఆ గుర్తింపులేని రాజకీయ పార్టీ అధ్యక్షుడి కోసం వెతుకుతున్నారు. వాచ్ రిపేర్ షాపు నడుపుతున్న వ్యక్తికి రాజకీయ పార్టీ విరాళం గురించి తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే పార్టీ అధ్యక్షుడు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంటారని తెలిసింది. అత‌డిని ప‌ట్టుకుని విచారిస్తే తాను కేవలం 3 శాతం కమీషన్ మాత్ర‌మే తీసుకొని పార్టీ విరాళానికి డొనేషన్ సర్టిఫికెట్ జారీ చేశాన‌ని తెలిపాడు. ఇలా రాజకీయ పార్టీల విరాళాల పేరిట పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని ఐటీ అధికారుల విచార‌ణ‌లో తేలింది.

ఇక మహారాష్ట్ర రాజ‌ధాని ముంబబైలోని సియాన్ ప్రాంత మురికివాడలో వంద గజాల చిన్న గుడిసె చిరునామాతో రిజిస్టరు అయిన ఓ రాజకీయ పార్టీకి గత రెండేళ్లలో వంద కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందాయని ఆ పార్టీ బ్యాంకు రికార్డుల్లో వెల్లడి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ పార్టీకి ఎన్నిక‌ల క‌మిష‌న్ గుర్తింపు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాను పార్టీకి నామ‌మాత్ర‌పు అధ్య‌క్షుడిని మాత్ర‌మేన‌ని.. అసలు విరాళాల వ్యవహారాన్ని అహ్మదాబాద్ లో ఉంటున్న‌ ఆడిటర్ చూసుకుంటున్నాడని సదరు గుర్తింపు లేని పార్టీ అధ్యక్షుడు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అదేవిధంగా ముంబైలోన‌ని బోరివలి ప్రాంతంలోని రేకుల షెడ్డులో నడుస్తున్న ఓ రాజకీయ పార్టీ రూ.50 కోట్ల విరాళాలను స్వీకరించినట్లు అధికారుల త‌నిఖీల్లో వెల్లడైంది. ఈ విరాళాలు పలువురి చేతులు మార‌డం గ‌మ‌నార్హం. దేశంలోని 205 ప్రాంతాల్లో రాజకీయ పార్టీలపై దాడి చేసిన ఐటీ అధికారులకు దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు తెలిశాయి. రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు ఇచ్చేవారికి ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌టంతో ప‌న్నును త‌ప్పించుకోవ‌డానికి ఇలా ఫేక్ పార్టీల‌న ఏర్పాటు చేసి విరాళాలు ఇస్తున్నార‌ని చెబుతున్నారు.

ఇలా మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌ల్లోని గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీలు ఏకంగా రూ.2000 కోట్ల విరాళాలు స్వీకరించాయని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 21 రాజకీయ పార్టీల విరాళాల బాగోతంపై ఐటీ శాఖ దర్యాప్తు సాగిస్తోంది. అలాగే ఢిల్లీ, గుర్గావ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ల్లోనూ ఐటీ అధికారులు రాజకీయ పార్టీల విరాళాలపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా దేశంలో 2099 రాజకీయ పార్టీలు రిజిస్టరు కాగా, వీటిలో 2044 పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దేశంలో కేవలం 55 రాజకీయ పార్టీలను మాత్రమే కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారికి ఆదాయపు పన్ను రాయితీ వర్తిస్తుండటంతో విరాళాల పేరిట మ‌నీ లాండ‌రింగ్ చేస్తున్నార‌ని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.