Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు కేంద్రం షాక్‌.. ఏం చేసిందంటే

By:  Tupaki Desk   |   24 March 2022 3:30 AM GMT
కేసీఆర్‌కు కేంద్రం షాక్‌.. ఏం చేసిందంటే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. వ్యూహానికి కేంద్రం మ‌రోసారి చెక్ పెట్టింది. గ‌తంలో తాము చెప్పిన మాట‌కే క‌ట్టుబ‌డ‌తామ‌ని తేల్చి చెప్పింది. గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనితీరాల్సిందేన‌ని..కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ క్ర‌మంలో తాము తెలంగాణ ప‌వ‌ర్‌, ఉద్య‌మ స్థాయి ఏంటో కేంద్రానికి రుచి చూపిస్తామ‌ని కూడాఆయ‌న రెండు రోజుల కిందట వ్యాఖ్యానించా రు. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక బృందాన్ని సైతం కేంద్రానికి పంపించి.. చ‌ర్చ‌లు జ‌రిపేలా చ‌ర్య‌లు తీసుకు న్నారు. పంజాబ్‌కు ఒక న్యాయం తెలంగాణ కు ఒక న్యాయం అంటే కుద‌ర‌ద‌ని కూడా చెప్పారు.

అయితే.. కేసీఆర్ ఇంత చేస్తున్నా.. కేంద్రం మాత్రం చీమ‌కుట్టిన‌ట్టు కూడా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. అంతేకాదు.. ఇప్పుడు మ‌రోసారి.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి.. స్ప‌ష్ట‌త ఇచ్చింది. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదని పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం స్ప‌ష్టం చేసింది. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదన్న కేంద్రం.. ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయని తెలిపారు. పరిస్థితుల ఆధారంగానే ధాన్యం సేకరణ జరుగుతుందని స్పష్టం చేసింది.

అదేస‌మ‌యంలో కనీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్ ధరల మేరకు సేకరణ ఉంటుంద‌ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్‌సీఐ నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తాయని తెలిపింది. గోధుమ, వరి ధాన్యాలు నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తామ‌ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ఎంఎస్పీకి ముడి ధాన్యం సేకరణ ఉంటుంద‌ని తెలిపింది. ఎఫ్‌సీఐతో చర్చించి ప్రణాళిక ప్రకారం ధాన్యం సేకరణ చేస్తామ‌ని, ఈ విష‌యంలో ఎలాంటి లావాదేవీల‌కు, చ‌ర్చ‌ల‌కుకూడా అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పింది.

సేకరించిన ధాన్యం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ జరుగుతుందని కేంద్రం తెలిపింది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ చేసే ధాన్యం త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవాల్సిందేన‌ని తెలిపింది. లోక్‌సభలో పలువురు సభ్యుల ప్రశ్నలకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మ‌రి దీనిని బ‌ట్టి కేసీఆర్ వ్యూహం ఫ‌లించేలా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఫైర్ బ్రాండ్ ఏం చేస్తారో చూడాలి.