Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రికి కోర్టు జ‌రిమానా!

By:  Tupaki Desk   |   25 May 2018 5:11 AM GMT
తెలంగాణ మంత్రికి కోర్టు జ‌రిమానా!
X
ఏంటి ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు కూడా తెలంగాణ‌లో జ‌రుగుతాయా? అని అనుమానం వ‌చ్చింది క‌దా. ఇది నిజ‌మే. అయితే, ఆయ‌న‌కు జ‌రిమానా విధించింది తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు కాదు. జ‌రిమానా విధించింది సాధార‌ణ న్యాయ స్థాన‌మూ కాదు. కాజీ పేట రైల్వే కోర్టు ఆయ‌న‌కు జ‌రిమానా విధించింది.

తెలంగాణ ఉద్య‌మ స‌మయంలో ఉద్య‌మ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి నిరంత‌రం ఏదో ఒక ర‌క‌మైన ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఆ స‌మ‌యంలో ఆ పార్టీ ప్ర‌ముఖులంద‌రూ ప‌లు చోట్ల ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. వారి క‌ల అయితే నాలుగేళ్ల క్రిత‌మే సాకారం అయ్యింది గానీ ఆ కేసులు మాత్రం ఇంకా నానుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వం పెట్టిన కేసుల‌న్నిటినీ త‌మ అనుకూలం వ‌ర్గం వ‌ర‌కూ చాలా ఉప‌సంహ‌రించుక‌న్నారు. కానీ రైల్వే కోర్టు కేంద్రంలోని స్వ‌తంత్ర సంస్థ క‌దా. ఒక‌సారి ఫిర్యాదు వెళ్లాక అది స్థానిక ప్ర‌భుత్వాల ప‌రిధిలోకి రాదు. అలా కాజీ పేట రైల్వే కోర్టులో ఈట‌ల‌పై న‌మోదైన కేసులో అనేక వాయిదాల అనంత‌రం ఇపుడు తీర్పు వెలువ‌డింది.

వ‌రంగ‌ల్ జిల్లా, ఉప్ప‌ల్ రైల్వే స్టేష‌న్లో నిర‌స‌న‌లు తెలిపినందుకు గాను ఈట‌ల మీద న‌మోదైన కేసులో ఆయ‌న‌కు 2300 రూపాయ‌లు జ‌రిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కాజీపేట రైల్వే కోర్టు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ పి శ్రీవాణి స‌మక్షంలో మంత్రి ఈట‌ల త‌న త‌ప్పు అంగీక‌రించారు. ఉద్య‌మంలో భాగంగానే రైళ్ల‌ను అడ్డుకున్నామ‌ని, తాను చేసింది తప్పేన‌ని ఆయ‌న పేర్కొన‌డంతో ఇత‌ర దురుద్దేశాలు లేనందున‌ జ‌రిమానా మాత్ర‌మే విధించారు. 2009లో కేసుకు 1500 - 2012లో కేసుకు 800 మొత్తం క‌లిపి 2300 జ‌రిమానా విధించడంతో మంత్రి ఆ సొమ్మును కోర్టుకు చెల్లించారు. ఇంకా కొంద‌రిపై కూడా ఇదే జ‌రిమానా విధించారు.