Begin typing your search above and press return to search.

సారు తెలంగాణలో ఉంటే.. అమెరికాలో ఉన్నారంటున్న సర్కార్

By:  Tupaki Desk   |   3 March 2020 4:55 AM GMT
సారు తెలంగాణలో ఉంటే.. అమెరికాలో ఉన్నారంటున్న సర్కార్
X
రాష్ట్రం ఏదైనా కావొచ్చు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సదరు రాష్ట్రంలోనే ఉన్న తేదీల్లో విదేశీ పర్యటనల్లో ఉన్నారంటూ సమాధానం ఇస్తే ఏమనాలి? అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలతో సహా మీడియాలో అచ్చు అయిన విషయం ఒక పక్క రికార్డుల రూపంలో కనిపిస్తుంటే.. అదేమీ లేదు.. సదరు తేదీల్లో సారు అమెరికా ట్రిప్ వెళ్లి ఉన్నారంటూ ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సమాధానం షాకింగ్ గా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసింది. అసలు విషయం ఏమంటే..

2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే.. ఆ మాటకు వస్తే హైదరాబాద్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన పొల్గొన్న అధికారిక కార్యక్రమాలకుసంబంధించిన ఫోటోలు అప్పట్లో అన్ని ప్రధాన దినపత్రికల్లో అచ్చు అయ్యాయి. ఇదిలా ఉంటే.. జలగం సుధీర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 జూన్ 2 నుంచి 2020 ఫిబ్రవరి 15 వరకు ఏయే విదేశీ పర్యటనలు చేశారు? ఒక్కో పర్యటన కోసం పెట్టిన ఖర్చు ఎంత? ఆ టూర్లకు కేసీఆర్ వెళ్లిన వారి వివరాలు.. వారి కోసం పెట్టిన ఖర్చు లెక్కల్ని అడిగారు.

దీనికి బదులు గా జీఏడీ అధికారులు గత ఫిబ్రవరి 27న సమాధానమిస్తూ.. ఆరేళ్లలో కేసీఆర్ మూడు విదేశీ పర్యటనలు చేసినట్లుగా పేర్కొంది. అందులో రెండు (సింగపూర్.. మలేషియా.. చైనా) పర్యటనల వివరాలు ఓకే అయినా.. మూడో పర్యటనకు గురించి ఇచ్చిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు ఒకటి వరకు కేసీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఖర్చుల వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

కేసీఆర్ అమెరికా టూర్ కు సంబంధించి 2016 ఆగస్టు 26న జీవో జారీ (ఆర్టీ నెం.1895) అయినట్లుగా ప్రకటించింది. అయితే.. అధికారులు పేర్కొన్నట్లు సదరు తేదీల్లో సీఎం కేసీఆర్ అమెరికా పర్యటన కు వెళ్లలేదు. ఆ మూడు రోజులు హైదరాబాద్ లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఉన్నా.. లేదు.. లేదు ఆయన రాష్ట్రం బయట ఉన్నారంటూ జీఏడీ ఇస్తున్న సమాచారం విస్మయానికి గురి చేస్తుంది.

ఒకవేళ సీఎం టూర్ కు వెళ్లాలని అనుకొని.. చివరి నిమిషం లో వాయిదా పడిందనే అనుకుంటే.. దానికి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు దరఖాస్తు దారుకు ఇవ్వాల్సిన అధికారులు.. ఇలా తప్పుడు సమాచారం ఇవ్వటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు సంబంధించిన సమాచారమే ఇంత తప్పుల తడకగా ఎందుకు ఇస్తున్నట్లు? అన్నది క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.