Begin typing your search above and press return to search.

కేటీఆర్ మాటను అస్సలు లక్ష్య పెట్టని అభిమానులు.. వద్దన్నదే చేశారు

By:  Tupaki Desk   |   24 July 2022 4:54 AM GMT
కేటీఆర్ మాటను అస్సలు లక్ష్య పెట్టని అభిమానులు.. వద్దన్నదే చేశారు
X
ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలువురు అభివర్ణించే కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు. 1976లో ఇదే రోజున పుట్టిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో ఎంత పవర్ ఫుల్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి తెలంగాణ ఉద్యమాన్ని షురూ చేసిన వేళలో అమెరికాలో ఉన్న ఆయన.. ఉద్యమం ఒక దశకు చేరుకున్న తర్వాత తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణకు వచ్చేసి ఉద్యమంలో పాల్గొనటం తెలిసిందే.

తన తండ్రి రాజకీయానికి అసలుసిసలు వారసుడిగా బరిలోకి దిగటమే కాదు.. అందులో వ్యూహాత్మక విజయాన్ని సొంతం చేసుకోవటం కనిపిస్తుంది. మంచి మాటకారి కావటం.. మారిన పరిస్థితులకు తగ్గట్లు వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకోవటంతో పాటు.. తనదైన వర్గాన్ని మొయింటైన్ చేసే విషయంలో కేటీఆర్ మార్కు కాస్తంత భిన్నంగా ఉంటుంది. పేరుకు సౌమ్యుడిగా ఉన్నప్పటికీ.. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన తీరు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ఇటీవల తాను టార్గెట్ గా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీపై డైలీ బేసిస్ లో ఏదో ఒక ఇష్యూతో ముడి పెట్టి విమర్శలు చేయటం కనిపిస్తూ ఉంటుంది.

ఈ రోజు (జులై 24)(ఆదివారం) తన పుట్టిన రోజు కావటంతో.. ఆ సందర్భంగా తన పేరుతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు.. ప్రచారాలు.. పేపర్లలో ప్రకటనలు లాంటివి చేయొద్దని.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏదో ఒక రూపంలో సాయం చేసి.. వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ అంతలా మొత్తుకున్నప్పటికీ ఆయన్ను అభిమానించే అభిమాన గణం మాత్రం ఆ విషయాన్ని పిచ్చ లైట్ తీసుకోవటం గమనార్హం. అంతేకాదు.. ఆయన మాటకు భిన్నంగాపెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేయటంతో పాటు.. దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటలు ఇవ్వటం కనిపిస్తుంది.

సాధారణంగా ఎవరైనా నేత.. తాను చెప్పింది చెప్పినట్లుగా వినే అభిమాన గణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కీలక ఆదేశాలు ఏమైనా నోటినుంచి వస్తే.. వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ.. మంత్రి కేటీఆర్ చెప్పిన మాటను ఆయన్ను అభిమానించే నేతలు ఎవరూ పట్టించుకోకుండా.. తమకు తోచినట్లుగా తమ అభిమాన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ.. మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్లుగా గిఫ్ట్ ఏ స్మైలీ పేరుతో సాయం చేయాలన్న దానిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇదేంది నాయకా.. ఇలాంటి నేతల్ని అభిమాన గణంగా ఉంచుకోవటమా? అన్న ప్రశ్న కొందరి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.