Begin typing your search above and press return to search.

వారం తర్వాత దేశ రాజధాని నుంచి ఉత్త చేతుల్లో వచ్చిన టీ మంత్రులు

By:  Tupaki Desk   |   25 Dec 2021 5:00 AM GMT
వారం తర్వాత దేశ రాజధాని నుంచి ఉత్త చేతుల్లో వచ్చిన టీ మంత్రులు
X
గడిచిన వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉంటూ.. కేంద్ర మంత్రితో భేటీ కోసం వేచి చూడటం.. నిత్యం ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర సర్కారుపై విరుచుకుపడటం.. వారి విధానాల్ని తీవ్రంగా తప్పు పడుతూ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ పదునైన మాటలతో విరుచుకుపడిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల టీం తాజాగా ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ కు వచ్చేసింది.

దీంతో.. కేంద్ర వ్యవసాయ మంత్రి పీయూష్ గోయిల్ తో భేటీ అయి.. వానాకాలంలో తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్నితీసుకుంటామని ఎఫ్ సీఐ పేర్కొనటం.. అందుకు భిన్నంగా 60 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలన్న డిమాండ్ తో ఢిల్లీకి చేరుకున్నారు.

ఇదిలా ఉంటే.. కేంద్ర మంత్రి పీయూష్ గోయిల్ దీనికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ముడి బియ్యం ఎంత ఇచ్చినా తీసుకోవటానికి అభ్యంతరం లేదని.. బకాయి ఉన్న 27 లక్షల టన్నుల బియ్యం వెంటనే ఇవ్వాలని ఎదురుదాడికి దిగారు. దీంతో.. ఎవరి వాదన వారు వినిపిస్తున్న పరిస్థితి. అయితే.. తమ డిమాండ్ కు కేంద్ర మంత్రి నుంచి లిఖిత పూర్వక సమాధానం తీసుకొనే ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తామన్న వారు.. తాజాగా తెలంగాణకు వచ్చేశారు.

ఈ సందర్భంగా తాము పడిగాపులు కాస్తున్నా.. కేంద్ర మంత్రి మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని.. ఈ తీరు కోట్లాది మంది తెలంగాణ ప్రజల్ని అవమానించటమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రుల టీం మండిపడుతోంది. మొత్తానికి వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ మంత్రుల నిరీక్షణ ఫలించి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయిల్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ధాన్యం ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఆయన పాత పాడటం.. అందుకు ప్రతిగా లిఖిత పూర్వక హామీ ఇస్తేనే తిరిగి వెళతామని మంత్రుల టీం తేల్చి చెప్పటంతో కేంద్రం స్పందించలేదు.

దీంతో.. చేసేదేమీ లేక మంత్రుల టీం తాజాగా హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. వారం రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా వట్టి చేతులతో టీఆర్ఎస్ మంత్రులు తిరిగి రాగా.. వారు సంధించిన పదునైన వ్యాఖ్యలు మాత్రం రికార్డుల్లోకి ఎక్కాయని చెప్పక తప్పదు.