Begin typing your search above and press return to search.

బంద్ పిలుపు ఇచ్చి తమ్ముళ్లు తొందరపడ్డారా?

By:  Tupaki Desk   |   5 Oct 2015 8:53 AM GMT
బంద్ పిలుపు ఇచ్చి తమ్ముళ్లు తొందరపడ్డారా?
X
ఈ పార్టీ.. ఆ పార్టీ అన్న తేడా లేకుండా ఒక్క మజ్లిస్.. జానారెడ్డి మినహాయించి.. తెలంగాణ అసెంబ్లీలో సోమవారం సభ జరిగే సమయానికి ఉన్న అన్ని పార్టీలకు చెందిన సభ్యులను.. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేవరకూ సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మంగళవారం బంద్ నకు పిలుపునిచ్చింది. రైతుల సమస్యలపై నిలదీసేందుకే తాము బంద్ పిలుపు ఇచ్చినట్లు చెబుతున్న తెలంగాణ తమ్ముళ్లు.. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు తీవ్రంగా విఫలమైనట్లుగా విమర్శించారు.

మరి.. తమ్ముళ్లు ఇచ్చిన బంద్ కు ఎలాంటి స్పందన ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. విభజన నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్టు బాగా తగ్గిందన్న అభిప్రాయం ఉంది. రైతుల సమస్యల మీద విపక్షాలన్నీతెలంగాణ సర్కారు వైఖరిపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే హడావుడిగా బంద్ నిర్ణయం ప్రకటించటం బాగోలేదన్న వాదన వినిపిస్తోంది.

విపక్షాల మధ్య ఇప్పుడిప్పుడే ఐకమత్యం పెరుగుతున్న నేపథ్యంలో.. తమ్ముళ్లు తొందరపాటుతో బంద్ పిలుపు ఇచ్చే కన్నా.. మిగిలిన విపక్షాల్ని ఒప్పించి బంద్ లో పాల్గొనేలా చేస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. విపక్షాలన్నీ కలిసికట్టుగా అన్నదాతల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించి ఉండే తెలంగాణ సర్కారు డిఫెన్స్ లో పడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం పెద్దగా పట్టులేని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో బంద్ నిర్వహణ సోసోగా సాగితే.. ఆ పార్టీకి ఎలాంటి పట్టు లేదన్న విషయం అందరికి అర్థం కావటమే కాదు.. తెలంగాణ సర్కారు బలాన్ని చాటి చెప్పినట్లు అవుతుందని చెబుతున్నారు. తన బలహీనతల్ని బయట పెట్టుకునేలా వ్యవహరించే కన్నా.. ప్రభుత్వ బలహీనత బయటపడేలా వ్యూహం రచించి ఉంటే బాగుండేది. విపక్షంలో ఉన్నప్పుడూ అందరితో కలవటం.. లేదంటే కలుపుకుపోవటం చాలా ముఖ్యం. మరి.. తమ్ముళ్లు ఆ విషయం తెలిసేదెప్పుడు..?