Begin typing your search above and press return to search.

కోకాపేట కంటే తక్కువ విలువకే ఖానామెట్ వేలం.. ఎంత పలికిందంటే?

By:  Tupaki Desk   |   17 July 2021 4:12 AM GMT
కోకాపేట కంటే తక్కువ విలువకే ఖానామెట్ వేలం.. ఎంత పలికిందంటే?
X
రోజు వ్యవధిలో జరిగిన భూముల వేలం మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించింది. రికార్డు స్థాయిలో కోకాపేట భూముల వేలంలో ధర పలికిన పక్క రోజే హైటెక్ సిటీని ఆనుకొని ఉండే ఖానామెట్ కు చెందిన ప్రభుత్వ భూముల్ని టీఎస్ఐఐసీ అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన ఈ - ఆక్షన్ ను నిర్వహించారు.

ఇందుకోసం తమ వద్ద ఉన్న భూముల్లో 14.91 ఎకరాల భూమిని వేలం వేశారు. కోకాపేటలో అత్యధికంగా ఎకరం రూ.60 కోట్లు పలికిన పక్క రోజున ఖానామెట్ లో జరిపిన భూవేలంలోనూ భారీ ధరలు పలికాయి. కాకుంటే.. కోకాపేట కంటే కాస్త తక్కువ ధరకు అమ్ముడయ్యాయి. అదేసమయంలో.. సగటున చూస్తే.. కోకాపేట కంటే కూడా ఎక్కువ ధర పలకటం గమనార్హం.

ఖానామెట్ లో జరిపిన తాజా వేలంలో ఎకరం అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. తాజా భూవేలంతో ప్రభుత్వ ఖజానాకు రూ.729.41 కోట్ల సొమ్ము జమ కానుంది. మొత్తంగా రెండు రోజుల వ్యవధిలో అమ్మిన భూములతో ప్రభుత్వానికి రూ.2500 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పాలి.

కోకాపేటలో 49.94 ఎకరాల్ని అమ్మితే.. ఖానామెట్ లో 14.91 ఎకరాల్ని అమ్మింది. ఖానామెట్ లో సర్వే నెంబరు 41/14లోని 14.91 ఎకరాల భూమిని ఐదు ప్లాట్లుగా విభజించారు. ఎకరం అప్ సెట్ ప్రైస్ ను రూ.25 కోట్లుగా ప్రభుత్వం డిసైడ్ చేయగా.. వేలంలో మాత్రం అంతకు మించిన ధరలు పలకటం గమనార్హం.

అమ్మకానికి పెట్టిన ఐదు ఫ్లాట్లలో కనిష్ఠంగా 2 ఎకరాలు ఉంటే.. గరిష్ఠంగా 3.69 ఎకరాలు ఉంది. వేలంలో భూముల ధరలు భారీగా పలకటం గమనార్హం. కోకాపేటలో ఎకరం రూ.60 కోట్లు పలికింది ఒక ఫ్లాట్ మాత్రమే. తాజాగా నిర్వహించిన ఖానామెట్ లో నిర్వహించిన వేలంలో గరిష్ఠ ధర కోకాపేట కంటే కాస్త తక్కువగా పలికినప్పటికీ.. సరాసరిన చూస్తే.. ఖానామెట్ లోనే భూమి ధర భారీగా పలికిందని చెప్పాలి.

వేలం నిర్వహించిన భూముల్లో కనిష్ఠంగా ఎకరం ధర రూ.43.6 కోట్లు పలకగా.. గరిష్ఠంగా మాత్రం రూ.55 కోట్లు పలికింది. కోకాపేట వేలంలో చూసినప్పుడు.. అక్కడ కనిష్ఠంగా ఎకరం రూ.36 కోట్లు మాత్రమే పలికింది. ఈ లెక్కన చూస్తే.. ఖానామెట్ భూముల వేలంలోనే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం లభించినట్లుగా చెప్పాలి.

ఖానామెట్ భూముల వేలంలో భూముల్ని సొంతం చేసుకున్నవన్నీ ప్రైవేటు సంస్థలే కావటం గమనార్హం. మొత్తం ఐదు ఫ్లాట్లలో రెండింటిని ఒకే సంస్థ సొంతం చేసుకుంటే.. మిగిలిని మూడింటిని మూడు వేర్వేరు సంస్థలు సొంతం చేసుకున్నాయి. వరుసగా రెండు రోజుల్లో నిర్వహించిన భూముల వేలం ప్రభుత్వానికి కొత్త హుషారును తీసుకొచ్చాయి.

భారీ బడ్జెట్ కు తగ్గట్లు ఆదాయాన్ని సమకూర్చుకోలేక సతమతమవుతోంది. కరోనా దెబ్బకు ఆశించినంత ఆదాయం రాని వేళలో.. భూముల అమ్మకాలతో భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నిర్వహించిన ఖానామెట్ భూముల వేలంలో ఐదు ప్లాట్లను సొంతం చేసుకున్నదెవరన్న ది చూస్తే..

క్రమ సంఖ్య విస్తీర్ణం (ఎకరాల్లో) పలికిన ధర (రూ.కోట్లలో) ఎవరికి సొంతమంటే

1 3.15 48.6 లింక్ వెల్ టెలీ సిస్టమ్స్

2 3.15 43.6 అప్ టౌన్ లైఫ్ ప్రాజెక్టు

3 3.69 50.4 జీవీపీఆర్ ఇంజనీర్స్

4 2.92 55 మంజీరా కన్ స్ట్రక్షన్స్

5 2 46.2 లింక్ వెల్ టెలిసిస్టమ్స్