Begin typing your search above and press return to search.

విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు..డిపోల దగ్గర పండగ వాతావరణం!

By:  Tupaki Desk   |   29 Nov 2019 5:18 AM GMT
విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు..డిపోల దగ్గర పండగ వాతావరణం!
X
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కి సీఎం కేసీఆర్ ముగింపు పలికాడు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు 55 రోజుల తర్వాత శుక్రవారం విధుల్లో చేరుతున్నారు. కార్మికులని బేషరతుగా విధుల్లో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనితో శుక్రవారం తెల్లవారుజాము నుండే ఆర్టీసీ కార్మికులు డిపోల వద్దకు చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలో కార్మికులంతా విధులకు తరలివస్తున్నారు. అలాగే తమకు ఎలాంటి షరతులు విధించకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో కార్మికులు ఆనందంగా ఉన్నారు.

ఇన్నాళ్లు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడ్డ జనం కూడా.. ఆర్టీసీ కార్మికుల చేరికతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డిపోల్లో కార్మికుల సమ్మె సమయంలో బలిదానం చేసిన కార్మికులకు నివాళులు అర్పించి విధుల్లో చేరుతున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్మికులు సమ్మె బాట పట్టిన తరువాత 50 రోజులకు పైగా సేవలందించిన తాత్కాలిక డ్రైవర్లు - కండక్టర్లు నేటి నుండి ఆర్టీసీ నుంచి తప్పుకుంటున్నారు. సమ్మె రోజుల్లో వీళ్లంతా చక్కగా పనిచేశారని - తాత్కాలిక ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది అని సీఎం కేసీఆర్ వారికి కూడా భరోసా ఇచ్చారు.

అలాగే ఆర్టీసీ సంక్షేమం కోసం కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున టిక్కెట్ రేటు పెంచబోతున్నట్టు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా 760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తోంది ప్రభుత్వం. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీనితో పాటుగా ఆర్టీసీకి తక్షణ సహాయం కింద రూ.100కోట్లు కూడా మంజూరు చేశారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మె కి ముగింపు పలికి కార్మికులని విధుల్లోకి చేరండి అని చెప్పడంతో రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.