Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మె లాస్ట్ సీన్ ఇలానే ఉండనుందా?

By:  Tupaki Desk   |   22 Oct 2019 5:30 AM GMT
ఆర్టీసీ సమ్మె లాస్ట్ సీన్ ఇలానే ఉండనుందా?
X
కోటి ఆశలతో మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పడు ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గురి చూసి కొట్టినట్లుగా సరిగ్గా.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరిగే వేళలో సమ్మెకు వెళ్లటం ద్వారా ఆర్టీసీ జేఏసీ పక్కా ప్లాన్ వేసిందని చెప్పాలి. అనుకున్న దానికి భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాలతో సమ్మె లెక్క తేలలేదు. ఇందులో సీఎం కేసీఆర్ పట్టుదల.. మొండితనం.. సమ్మెలకు తలొగ్గకూడదని.. కార్మికులకు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బలమైన సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో.. సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల వేళ..రాజకీయ డ్యామేజ్ కంటే కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో కొన్నింటినైనా పరిష్కరిస్తారన్న అంచనాకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించారు. ఉప ఎన్నిక పోలింగ్ పూర్తి కావటం.. వెనువెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ను చూసినప్పుడు.. హుజూర్ నగర్ లో కారు దూసుకెళ్లటం ఖాయమన్న వైనం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో సమ్మె ముగింపు సీన్ ఎలా ఉండనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నైతిక స్థైర్యాన్ని మరింత పెంచితే.. విపక్షాలకు మాత్రం అందుకు భిన్నంగా డిఫెన్స్ లో పడే పరిస్థితి. దీనికి తోడు కొందరు కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహంతో సమ్మె వేళ జరుగుతున్న ఉప ఎన్నికను కేసీఆర్ పాలనకు.. ఆయన నిర్ణయాలకు రెఫరెండంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంగా సవాలు విసిరారు.

అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ క్యాంప్.. ఇలాంటి సవాళ్లకు స్పందించకుండా కామ్ గా ఉంది. ఫలితం సానుకూలంగా వచ్చినంతనే అధికారపక్షం గొంతులు విపక్షాల మీద విరుచుకుపడటం ఖాయమంటున్నారు. ఇలాంటి వేళ.. సమ్మె లాస్ట్ సీన్ ఎలా ఉంటుందన్న విషయంలోకి వెళితే.. కోర్టు కల్పించుకొని ప్రభుత్వానికి ఇచ్చే ఆదేశాల మీదే విషయమంతా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

కార్మికులు చేస్తున్న సమ్మెకారణంగా ప్రజలు ఇబ్బందిపడిన విషయంపై కోర్టు మొట్టికాయలు వేస్తూనే.. వారి డిమాండ్లలో కొన్నింటిని తీర్చటంతో పాటు.. ప్రభుత్వాన్ని మెట్టు దిగమన్నట్లుగా సూచన చేసే వీలుంది. తెగే వరకూ లాగొద్దన్నట్లుగా కేసీఆర్ సైతం కోర్టు వ్యాఖ్యల్ని ప్రాతిపదికగా తీసుకుంటారని.. దీంతో ఆర్టీసీ సమ్మె ముగిసే అవకాశం ఉందంటున్నారు. నిరసనలు.. కేసులు.. లాఠీ ఛార్జ్ లు.. అరెస్ట్ లు ఇలా ఎన్నో ప్రతికూలతల్ని సమ్మె కారణంగా చవిచూచిన ఆర్టీసీ కార్మికులకు కలిగే ప్రయోజనం మాత్రం పెద్దగా ఉండదనే మాట బలంగా వినిపిస్తోంది.