Begin typing your search above and press return to search.

తెలంగాణ లో శానిటైజర్ బస్సు రెఢీ.. అదెలా ఉంటుందంటే?

By:  Tupaki Desk   |   17 April 2020 3:00 AM GMT
తెలంగాణ లో శానిటైజర్ బస్సు రెఢీ.. అదెలా ఉంటుందంటే?
X
కరోనా పుణ్యమా అని భౌతిక దూరం.. లాక్ డౌన్ లాంటి కొత్త మాటలెన్నో సాధారణ ప్రజలు సైతం విరివిగా వాడేస్తున్న వైనం తెలిసిందే. కాలానికి.. అవసరానికి తగ్గట్లు తనకు తానుగా మార్చుకునే అలవాటు మనిషికి చాలా ఎక్కువ. మిగిలిన జీవులతో పోలిస్తే.. ఈ విషయంలో మనిషి చాలా వేగంగా మారి పోతుంటాడు. కరోనా పుణ్యమా అని ప్రపంచంలోని ప్రజలంతా తమ జీవన శైలిలో ఎన్ని మార్పులు చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

తాజాగా కరోనా ప్రమాదం నుంచి కాపాడుకునేలా.. ప్రజా రవాణాను కొత్త పుంతలు తొక్కించే కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. భౌతిక దూరంతో పాటు.. శానిటైజర్లను వినియోగించటం ద్వారా వైరస్ ప్రమాదాన్ని తప్పించుకునే వీలుంది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ఆర్టీసీ కరోనా స్పెషల్ బస్సును సిద్ధం చేసింది. పూర్తిగా శానిటైజ్ చేసిన బస్సును సిద్ధం చేసింది. కాచిగూడ ఆర్టీసీ డిపో ఈ తరహా బస్సును తయారు చేసింది.

ఇంతకీ శానిటైజర్ బస్సు అంటే ఏమిటి? దాన్ని ఎలా రూపొందించారన్న విషయాన్ని చూస్తే.. బస్సులోని సీట్లను పూర్తిగా తొలగించారు. రెండువైపులా కిటికీ పైభాగాల్లో లిక్విడ్ స్ప్రే చేసే 12 నాజల్స్ ను ఏర్పాటు చేశారు. బస్సులో 200 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకును ఏర్పాటు చేశారు. దానికి మోటారును బిగించారు.

వెనుక డోర్ నుంచి ముందు డోర్ వరకూ రెండు వైపుల పైపులు ఏర్పాటు చేశారు. ఈ పైపుల నుంచి నాజల్స్ కు కనెక్షన్ కలిపారు. ట్యాంకులో సోడియం హైడ్రో ఫ్లోరిడ్ ద్రవణాన్ని నీటిలో కలిపారు. ఎవరైనా ముందు నుంచి కానీ వెనుక నుంచి కానీ ఎక్కిన వెంటనే నాజుల్స్ స్ప్రే అవుతుంది. దీంతో కరోనా వైరస్ నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ బస్సును సిద్ధం చేయటానికి కేవలం రూ.10వేలు మాత్రమే ఖర్చు అయినట్ులగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో వివిధ అవసరాల కోసం ఈ తరహా శానిటైజర్ బస్సుల్ని సిద్ధం చేయాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది.