Begin typing your search above and press return to search.

టీ ఆర్టీసీ సమ్మె.. ఏపీకి నిజమైన పండుగ

By:  Tupaki Desk   |   14 Oct 2019 6:38 AM GMT
టీ ఆర్టీసీ సమ్మె.. ఏపీకి నిజమైన పండుగ
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు. కానీ ఇప్పుడు దానికి రివర్స్ గా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పాలిట వరంగా మారింది. నష్టాల్లో ఉన్న ఏపీ ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో పండుగ చేసుకుంటోంది.

తెలంగాణలో సరిగ్గా బాగా రష్ ఉండే దసరాకే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో ఒక్క బస్సు కూడా కదలని పరిస్థితి. దసరా సీజన్ గిరాకీ అంతా పాయే.. అయితే దీన్ని క్యాష్ చేసుకుంది ఏపీ ఆర్టీసీ .. దసరా పండుగ సీజన్ లో ఏపీ ఆర్టీసీకి లాభాల పంట పండిందని లెక్కలు చెబుతున్నారు..

దసరా సందర్భంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో నివాస మున్న ఏపీ వాసులు ఆంధ్రాకు వెళ్లడానికి సమ్మెతో ఇబ్బందులు పడ్డారు. సమ్మె వల్ల తెలంగాణ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీన్ని క్యాష్ చేసుకుంటూ ఏపీ బస్సులను హైదరాబాద్ కు ఎక్కువగా వేశారు. అమ్మవారి నవరాత్రులకు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు తెలంగాణ వాసులు ఎక్కువగా ఏపీ ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 27నుంచి ఈనెల 13వరకు మొత్తం 5887 ప్రత్యేక బస్సుల ద్వారా ఏపీ ఆర్టీసీకి లాభాల పంట పడింది. నిత్యం 75వేల మందిని తరలిస్తూ కాసులు కురిపించుకున్నాయి.

దసరా పండుగ సీజన్ లో గత ఏడాదితో పోలిస్తే ఏపీ ఆర్టీసీకి అదనంగా రూ.20 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం రూ.229 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అక్యుపెన్షీ రేషియా ఏకంగా 103శాతానికి పెరిగిందంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో ఏపీ ఆర్టీసీకి లాభాల పంట పండిందని చెప్పవచ్చు.