Begin typing your search above and press return to search.

మరో ‘పోరు తెలంగాణ’ కాబోతోందా?

By:  Tupaki Desk   |   21 Oct 2019 5:53 AM GMT
మరో ‘పోరు తెలంగాణ’ కాబోతోందా?
X
తెలంగాణ ఈనెల 21 నుంచి పోరు తెలంగాణగా మారుతోంది. ఆర్టీసీ సమ్మెతో ఏకతాటిపైకి రాబోతోంది. కేసీఆర్ సర్కారుకు సెగ పుట్టించేలా ఆర్టీసీ కార్మికులు - ప్రజాసంఘాలు - రాజకీయాలు పార్టీలు కలిసి జేఏసీగా ప్రత్యక్ష ఉద్యమకార్యాచరణకు దిగబోతున్నాయి. ఈ పరిణామం తెలంగాణలో మరో సకలజనుల సమ్మెకు పురుడుపోస్తుందనే టెన్షన్ ప్రభుత్వ వర్గాలను పట్టి పీడిస్తోంది..

ఈనెల 21న ఆర్టీసీ కార్మికులు పోరుబాటకు శ్రీకారం చుడుతున్నారు.

* 21న డిపోల ముందర కుటుంబాలతో ధర్నాకు ప్లాన్ చేశారు.
* 22న తాత్కాలిక డ్రైవర్లతో ములాఖత్ - ఉద్యోగాలకు వెళ్లొద్దని వినతలు ఇస్తారు.
*23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలుపాలని - ఉద్యమంలో భాగస్వాములు చేయాలని కోరుతారు
*24న మహిళా కండక్టర్లతో డిపోల ఎదుట ధర్నాలు
*25న రాస్తారోకోలు - రహదారుల దిగ్భంధనం
*26న కార్మికుల పిల్లలతో ధర్నాలు
*27న దీపావళి పండుగ చేసుకోకుండా నిరసన
*28న కోర్టులో కేసు వాదనలు చేయాలని నిర్ణయం
*30న 5 లక్షల మందితో సకలజనుల సమరభేరి నిర్వహించడం..

ఈ పది రోజుల ఆర్టీసీ కార్మికుల ఉద్యమం తెలంగాణలో మరో సకలజనుల సమ్మెగా రూపం దాల్చుతోంది. మిలియన్ మార్చ్ ను 30న 5 లక్షల మందితో సకలజనుల సమరభేరి మళ్లీ చేయాలని ఆర్టీసీ కార్మికులు తలపోయడం తెలంగాణలో అగ్గిరాజేస్తోంది..ఇదే జరిగితే తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం లేకపోలేదు.

*సకల జనుల సమ్మె చరిత్రలో చిరస్మరణీయం

తెలంగాణలోని ముసలి ముతక - చిన్నా పెద్ద - ఉద్యోగులు - ఉపాధ్యాయులు - కార్మికులు.. సకల ప్రజలు అంతా కలిసి చేసిన ‘సకల జనుల సమ్మె’ చరిత్రలో నిలిచిపోయింది. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కు లక్షలాది మంది తెలంగాణ ప్రజలు వచ్చి హైదరాబాద్ ను దిగ్బంధించారు. ఈ నిరసన దేశంలోనే చర్చనీయాంశమైంది. ప్రజా ఉద్యమానికి ఢిల్లీ కదిలి తెలంగాణను ప్రకటించింది. ఈ మహోజ్వల పోరాటానికి గుర్తుచేసుకొని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణలో మరో సకలజనుల సమ్మెకు ప్లాన్ చేశాయి.

నాడు తెలంగాణ సాధన కోసం ప్రజలు స్వచ్ఛందంగా అన్నీ మానుకొని ఆరువారాల పాటు ‘సకలజనుల సమ్మె’ చేశారు .సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు - ప్రభుత్వ ఉద్యోగులు - సింగరేణి కార్మికులు 27 రోజులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అదే అస్త్రాన్ని తీస్తుండడం.. అందరూ ఏకతాటిపైకి వస్తుండడంతో మరో పోరు తెలంగాణ ఆవిష్కృతం కాబోతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.