Begin typing your search above and press return to search.

టీ ఎస్ ఆర్ టీ సీ యూ టర్న్ ..మళ్లీ సమ్మె బాట

By:  Tupaki Desk   |   22 Nov 2019 8:59 AM GMT
టీ ఎస్ ఆర్ టీ సీ యూ టర్న్ ..మళ్లీ సమ్మె బాట
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ..నిరంతరాయంగా 48 రోజులు సమ్మె చేసారు.ఈ సమ్మె ప్రభావం తెలంగాణ ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపింది. కానీ , తెలంగాణ ప్రభుత్వం పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక ప్రభుత్వం తప్ప , మిగిలిన అన్ని పార్టీలు ఈ ఆర్టీసీ సమ్మె ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని నానా హైరానా సృష్టించారు. ఇక చేసేదేమి లేక కార్మికులు , జేఏసీ నేతలతో కలిసి హై కోర్ట్ మెట్లు ఎక్కారు. హై కోర్ట్ లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే ... కొద్ది రోజుల వాదనల తరువాత ఈ కేసుని లేబర్ కోర్ట్ కి ఫార్వర్డ్ చేసింది.

ఈ మధ్య లోనే సీఎం కేసీఆర్ .. ఆర్టీసీ కథ ముగిసింది అని , సగం రోడ్లని ప్రైవేట్ కి అప్పగిస్తున్నాం అని చెప్పారు. అలాగే కార్మికులకు ఉద్యోగం లో చేరాలని రెండు సార్లు డెడ్ లైన్ ఇచ్చారు. కానీ కార్మికులు సమ్మె ని కొనసాగించారు. ఇక తాజాగా హై కోర్ట్ కేసుని ..లేబర్ కోర్టుకి ఫార్వర్డ్ చేయడంతో , ఈ సమస్య ఇప్పుడప్పుడే తీరదని గమనించిన ఆర్టీసీ కార్మికులు , జేఏసీ నేతలు చర్చించుకొని ... ప్రభుత్వం బేషరతుగా ఆహ్వానిస్తే, సమ్మెను విరమిస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరిని ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఉద్యోగంలో చేర్చుకోవాలని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు.

కానీ , ఈ నిర్ణయం పై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో సమ్మెను విరమిస్తామని ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, నేడు మాట మార్చారు. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం రాలేదని, ప్రభుత్వ విధానాల వల్లే సంస్థ నష్టాల్లో ఉందని ఆరోపించిన ఆయన, సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాము ఎన్నో మెట్లు దిగొచ్చి, సమ్మెను విరమిస్తామని ప్రకటించినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. శనివారం నాడు అన్ని డిపోల వద్దా సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలకు దిగనున్నామని తెలిపారు. తమకు డ్యూటీలు వేయాలని ఎవరూ అధికారుల వద్దకు వెళ్లవద్దని ఆయన అన్నారు. రేపు మరోసారి జేఏసీ నేతల సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.