Begin typing your search above and press return to search.

ఉద్యమనేతగా సెగ పెట్టిన ఆయన మంత్రిగా సెగ తాకింది!

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:44 AM GMT
ఉద్యమనేతగా సెగ పెట్టిన ఆయన మంత్రిగా సెగ తాకింది!
X
కాలమహిమ అని ఊరికే అనరేమో? ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ స్టార్ట్ చేసి.. కాలక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా మారి.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమనేతగా అవతారం ఎత్తారు. తన మాటలతో వేలాదిమందిని కదిలించిన వ్యక్తి ఇప్పుడు మంత్రిగా మారటం ఒక ఎత్తు అయితే.. ఉద్యమనేతగా అప్పటి ప్రభుత్వానికి సెగ పెట్టిన ఆయనకు.. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగమైన ఆయనకు ఉద్యమ సెగ తగిలి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇంతకూ ఆయన ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఉద్యోగ సంఘాల నేతగా శ్రీనివాస్ గౌడ్ ప్రముఖుడు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఒక రేంజ్లో లో హడావుడి చేసి.. అప్పటి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యిలా వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగమైన ఆయనకు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న నిరసన సెగ తాజాగా ఆయన్ను తాకింది.

సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేపడుతున్నారు. ఇదే రీతిలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద కార్మికులు నిరసన చేసి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. అదే సమయంలో మంత్రి కాన్వాయ్ వారికి ఎదురుపడింది. దీంతో.. కార్మికులు మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు.

ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమంలో ఇదే తీరులో వ్యవహరించిన శ్రీనివాస్ గౌడ్ కు.. మంత్రిగా అలాంటి అనుభవం ఎదురైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగమైన శ్రీనివాస్ గౌడ్..కొంతమంది సొంత ఎజెండాతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు కార్మికుల్ని రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. 44 శాతం ఫిట్ మెంట్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పగా.. ఫిట్ మెంట్ కాదు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో.. వారి సమస్యను సీఎంకు వద్దకు తీసుకెళతానని హామీ ఇచ్చి నిరసన సెగ నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఉద్యమనేతగా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన మాటలకు.. మంత్రిగా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలకు ఏ మాత్రం పోలిక లేదన్న మాట పలువురి నోటి వెంట రావటం గమనార్హం.