Begin typing your search above and press return to search.

ఏపీకి తెలంగాణ రివ‌ర్స్ పంచ్‌

By:  Tupaki Desk   |   9 Jun 2017 7:13 AM GMT
ఏపీకి తెలంగాణ రివ‌ర్స్ పంచ్‌
X
విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వెలుగు చూసే ఏ వివాద‌మైనా అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే కానీ ఫుల్ స్టాప్ పడే సూచ‌న‌లు అస్స‌లు క‌నిపించ‌వు. తాజాగా మ‌రోసారి అలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. మూడేళ్లుగా త‌మ‌కు ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల్ని వెంట‌నే చెల్లించాల‌ని లేనిప‌క్షంలో తెలంగాణ‌కు పంపిణీ చేసే విద్యుత్‌ ను నిలిపివేస్తామ‌ని ఏపీ విద్యుత్ అధికారులు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

తాజా హెచ్చ‌రిక‌ల‌తో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. తెలంగాణ రాష్ట్రం త‌మ‌కు రూ.3138 కోట్ల బ‌కాయిలు ఉన్న‌ట్లుగా చెబుతున్న ఏపీ అధికారులు.. మే 31 నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామ‌ని తెలంగాణ‌కు నోటీసులు ఇచ్చారు. దీనిపై తెలంగాణ విద్యుత్ అధికారులు అంతే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

ఏపీకి తాజాగా నోటీసులు జారీ చేసిన తెలంగాణ అధికారులు.. లెక్క‌లు చూస్తే ఏపీ విద్యుత్ సంస్థ‌లే త‌మ‌కు రూ.1676 కోట్లు చెల్లించాల్సి ఉంటుంద‌ని.. వెంట‌నే ఆ బ‌కాయిల్ని చెల్లించాల‌ని చెబుతోంది. లేని ప‌క్షంలో ఏపీకి తాము పంపిణీ చేస్తున్న విద్యుత్ ను నిలిపివేస్తామ‌ని ప్ర‌తి హెచ్చ‌రిక చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

నిజానికి ఇరు రాష్ట్రాల మ‌ధ్య బిల్లుల బ‌కాయి వివాదం మూడేళ్లుగా సాగుతోంది. తాజాగా నోటీసుల స్థాయికి వెళ్లిన వివాదం.. విద్యుత్ స‌ర‌ఫ‌రాను ప‌ర‌స్ప‌రం నిలిపివేస్తామ‌ని అనుకోవ‌టం వ‌ర‌కూ వెళ్లింది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఉమ్మ‌డి రాష్ట్ర జెన్ కో ఫ్లాంట్ల నుంచి తెలంగాణ‌కు 58.89 శాతం.. ఏపీకి 46.11 శాతం వాటాలు ఉన్నాయి. ఈ ప్ర‌కార‌మే విద్యుత్ పంప‌కాలు జ‌రుగుతున్నాయి. దీంతో.. ఏపీ నుంచి తెలంగాణ‌కు.. తెలంగాణ‌లో ఉత్ప‌త్తి అయ్యే థ‌ర్మ‌ల్ విద్యుత్ లో కొంత వాటాను ఏపీకి ఇవ్వ‌టం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. బ‌కాయిల పేరుతో ఏపీ తెలంగాణ‌కు విద్యుత్ పంపిణీని నిలిపివేస్తే.. తాము సైతం అదే రీతిలో తాము పంపిణీ చేసే విద్యుత్‌ ను నిలిపివేస్తామ‌ని తెలంగాణ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. చూస్తుంటే ఈ బ‌కాయిల వివాదం అంత‌కంత‌కూ పెరిగేలా ఉందే త‌ప్పించి త‌గ్గేదిగా క‌నిపించ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/