Begin typing your search above and press return to search.

తంబీలకు ‘సునామీ’ వార్నింగ్

By:  Tupaki Desk   |   28 Dec 2015 4:11 AM GMT
తంబీలకు ‘సునామీ’ వార్నింగ్
X
వరుస వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయి.. ప్రకృతి ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతోన్న తమిళనాడు వాసులకు కొత్త భయం మొదలైంది. తమిళనాడుకు సునామీ ముప్పు ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించటం కలకలాన్ని రేపుతోంద. దాదాపు పదకొండేళ్ల క్రితం (2004) డిసెంబరు 26న విరుచుకుపడిన సునామీ ఎంత బీభత్సాన్ని సృష్టించిందో తెలిసిందే. తమిళనాడును భారీగా ప్రభావం చూపిన సునామీతో తమిళులు విపరీతంగా వణికిపోయే పరిస్థితి.

గడిచిన నెలలో భారీ వర్షాలతో తమిళనాడు చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. వర్షం అంటేనే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల పీడకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తమిళనాడు ప్రజలకు సునామీ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికను వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. కన్యాకుమారి కులచ్చల్ నుంచి రామనాధపురం జిల్లా కీళక్కారై వరకు సముద్ర తీర ప్రాంతాల్లో 8 నుచి 10 అడుగుల ఎత్తులో అలలు భారీగా ఎగిసిపడే అవకాశం ఉందని హెచచరిస్తున్నారు.

సునామీ ప్రభావం ఈ రోజు (డిసెంబర్ 28) ఎక్కవగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ చేసిన సునామీ హెచ్చరికతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని చెప్పటంతో పాటు.. తీర ప్రాంతాలకు దగ్గర ఉన్న వారికి సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. మరోవైపు.. కన్యాకుమారి వద్ద సముద్రపు నీటి మట్టం పెరగటాన్ని అధికారులు గుర్తించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో కన్యాకుమారిలోని వివేకానందస్వామి.. తిరువళ్లువర్ విగ్రహాల వద్దకు రవాణా సౌకర్యాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ శాఖ చేసిన సునామీ హెచ్చరిక నిజం కాకూడదని.. తమపై విరుచుకుపడకూడదని తమిళులు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించాలని కోరుకుందాం.