Begin typing your search above and press return to search.

జపాన్ ను దెబ్బేసిన భూకంపం.. సునామీ

By:  Tupaki Desk   |   22 Nov 2016 4:30 AM GMT
జపాన్ ను దెబ్బేసిన భూకంపం.. సునామీ
X
ప్రకృతి ప్రకోపం ఎంత దారుణంగా ఉంటుందన్నది అప్పుడప్పుడూ చూస్తుంటాం. అరుదుగా వచ్చి పడే ఉపద్రవాలకే కిందామీదా పడుతుంటాం. కానీ.. జపాన్ కు మాత్రం నిత్యం గండమే. చిన్న భూకంపానికి హడలిపోయే మనతో పోలిస్తే.. జపాన్ లో తరచూ భూమి కంపిస్తూ ఉంటుంది. ప్రకృతి ప్రకోపం ఆ బుజ్జిదేశం మీద తరచూ పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ పట్టు సడలని ఆత్మవిశ్వాసంతో వారు ముందుకు వెళుతుంటారే కానీ.. అస్సలు వెనక్కి తగ్గరు.

సాలీడు ఎంతో జాగ్రత్తగా అల్లుకున్న సాలెగూడును మనం చీపురుతో ఒక్కసారి తీసిపారేస్తాం. కానీ.. సాలెపురుగు మళ్లీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. జపాన్ వాసులది కూడా దాదాపు సాలెపురుగు మాదిరే. ప్రకృతి పెట్టే పరీక్షల్ని తట్టుకుంటూ.. ఓపిగ్గా ఎప్పటికప్పుడు చెల్లా చెదురైన తమ పరిసరాల్ని బాగు చేసుకుంటూ కనిపిస్తారు. భూకంపాలకు పుట్టినిల్లు అయిన జపాన్ ను తాజాగా మరో భారీ భూకంపం.. సునామీ చుట్టేసింది. జపాన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటల వేళలో జపాన్ ఈశాన్య తీరంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.9గా నమోదైంది.

ఈ భూకంపం ధాటికి సముద్రంలో చెలరేగిన సునామీతో రాకాసి అలలు తీరంలోని పుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. 2011లో విరుచుకుపడిన రాకాసి అలలు (సునామీ) పుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. నాటి ఘటనలో దాదాపు 20వేల మందికి పైగా మరణించారు. భారీ నష్టం వాటిల్లింది. తాజాగా చోటు చేసుకున్న సునామీ ఘటనలో 1.14 మీటర్ల ఎత్తులో అలలు విరుచుకుపడినట్లుగా కొన్ని రిపోర్టులు చెబుతుంటే.. మరికొన్ని నివేదికలు 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయన్న సమాచారం అందుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సునామీ అలల కారణంగా పుకుషిమా అణుశక్తి కేంద్రం కొంత మేర ప్రభావితమైందని చెబుతున్నారు. దీని వల్ల ఎంత నష్టం వాటిల్లిందన్న అంశంపై స్పష్టత రావటం లేదు. తాజా భూకంపం.. సునామీలు జపాన్ ను పెద్దఎత్తున ప్రభావితం చేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/