Begin typing your search above and press return to search.

అర్చకులపై టీటీడీ కోపం.. సుప్రీం తీర్పెటు?

By:  Tupaki Desk   |   25 Dec 2018 7:33 AM GMT
అర్చకులపై టీటీడీ కోపం.. సుప్రీం తీర్పెటు?
X
అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం అభాసుపాలవుతోంది. అధికార పార్టీ అడుగులకు మడుగులు వొత్తలేదని.. టీడీపీ అక్రమాలను బయటపెట్టాడని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం రివేంజ్ తీర్చుకుంది. అర్చకులకు రిటైర్ మెంట్ అనే స్కీమ్ ను తీసుకొచ్చి ఆయన్ను బయటకు పంపింది. ఆయన్నే ఒక్కరినే తీసివేస్తే విమర్శలొస్తాయని గ్రహించి తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వృద్ధులైన పలువురు అర్చకులను - తిరుచానూరు అమ్మవారి దేవాలయంలోని మరికొందరు టీటీడీ తెచ్చిన రిటైర్ మెంట్ నిబంధనల పేర బయటకు పంపారు.

అయితే అర్చకత్వంలో రిటైర్ మెంట్ లేదని వాదిస్తున్న ఈ రిటైరైన అర్చకులు తాజాగా హైకోర్టుకు - సుప్రీంకోర్టు కెళ్లారు. తిరుచానూరు అర్చకులు హైకోర్టుకెళ్లగా.. వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. వెంటనే తిరుచానూరు అర్చకులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలను ఖతారు చేయని టీటీడీ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది.

ఇక తిరుమల శ్రీవారి అర్చకులు తమ రిటైర్ మెంట్ చెల్లదంటూ సుప్రీంకోర్టుకెక్కారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా టీటీడీ అర్చకులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ సాగుతోంది. హైకోర్టులాగానే సుప్రీంకోర్టు కూడా అర్చకులకు అనుకూలంగా తీర్పునిస్తే టీటీడీ ఇరుకునపడడం ఖాయంగా కనిపిస్తోంది. అర్చకుల విషయంలో టీటీడీ వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే విమర్శలపాలైంది. ఇప్పుడు సుప్రీం తీర్పుతోనైనా టీటీడీ మారి అర్చకులు తిరిగి విధుల్లోకి తీసుకుంటుందో ఏమో చూడాలి మరి..