Begin typing your search above and press return to search.

తిరుమ‌ల వివాదాల‌కు టీటీడీ బోర్డు చెక్‌: శ్రీవారి ఆస్తులు ఇవే!

By:  Tupaki Desk   |   28 Nov 2020 5:10 PM GMT
తిరుమ‌ల వివాదాల‌కు టీటీడీ బోర్డు చెక్‌:  శ్రీవారి ఆస్తులు ఇవే!
X
తిరుమ‌ల తిరుప‌తి శ్రీవారి భ‌క్తులు ఊర‌డిల్లేలా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల తిరుప‌తి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి(టీటీడీ బోర్డు) కోనేటి రాయుని కొండంత ఆస్తుల‌కు సంబంధించిన చిట్టాను శ్వేత ప‌త్రం రూపంలో బ‌హిర్గ‌తం చేసింది. ఇది నిజంగా సంచ‌ల‌న‌మేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆధ్యామిక రంగానికి చెందిన ప్ర‌ముఖులు, పెద్ద‌లు కొనియాడుతున్నారు. నిత్య వివాదాలు, నిరంత‌ర విమ‌ర్శ‌ల‌తో అల్లాడుతున్న తిరుమ‌ల గిరుల శ్రీనివాసుని ఆస్తుల విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఓ బ్ర‌హ్మ‌ప‌దార్థంగానే ఉండిపోయింది. గ‌త ప్ర‌భుత్వం చంద్ర‌బాబు హ‌యాంలో కూడా అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎన్నో ఆస్తుల‌ను నొక్కేశార‌ని, అయ్య‌వారి ఆస్తుల‌ను క‌బ్జా చేశార‌ని ఇలా.. అనేకానేక విమ‌ర్శ‌లు, వివాదాలు తిరుమ‌ల‌ను చుట్టుముట్టాయి.

అయితే.. అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు తిరుమ‌ల ఆస్తుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌న్న ప్ర‌తిప‌క్షాల‌(వైసీపీ) డిమాండ్ల‌ను తోసిపుచ్చారు. ఇలా ఎక్క‌డా లేద‌ని.. ఎవ‌రూ చేయ‌ర‌ని, ఇది భ‌క్తుల మ‌నోభావాల‌కు చెందిన విష‌య‌మ‌ని ఆయ‌న తోసిపుచ్చారు. అయితే.. చిత్రంగా టీడీపీ ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లిన త‌ర్వాత‌.. ఇదే డిమాండ్ చేయ‌డం, మ‌రోవైపు బీజేపీ నేత‌లు కూడా పూట‌కో వివాదంతో రోడ్డెక్క‌డంతో అఖిలాండ నాయ‌కుని ఆస్తుల‌పై అంద‌రి మ‌న‌సుల్లోనూ ఎక్క‌డో చింత బ‌య‌ల్దేరింది. నిజంగానే అయ్య‌వారి ఆస్తుల‌ను దోచేసుకుంటున్నారా? అంటూ.. ప్ర‌శ్న‌లు ముప్పిరిగొన్నాయి. సోష‌ల్ మీడియాలో వీటికి సంబందించిన అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కి వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. మ‌రింత‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు నాయ‌కులు.

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు టీటీడీ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అయ్య‌వారి ఆస్తుల‌కు సంబందించిన శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తామ‌ని.. గుండుసూది మొద‌లు.. ఆస్తులు ఎంత‌టివైనా.. అవి ఎక్క‌డ ఉన్నా.. అన్ని వివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచుతామ‌ని మూడు మాసాల కింద‌ట ప్ర‌క‌టించింది. అనుకున్న విధంగానే వంద రోజుల్లో ఈ క్ర‌తువును పూర్తి చేసి.. తాజాగా తిరుమ‌ల‌కు భ‌క్తులు ఇచ్చిన విరాళాలు, వాటిపై వ‌చ్చిన వ‌డ్డీలు, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కైంక‌ర్యాల ఖ‌ర్చు.. ఇలా పూస‌గుచ్చిన‌ట్టు ప‌క్కా పార‌ద‌ర్శ‌క‌త‌తో అన్నింటినీ గుదిగుచ్చి.. శ్వేత ప‌త్రం విడుద‌ల చేసింది. టీటీడీ బోర్డు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా దీనికి సంబంధించిన వివ‌రాల‌ను క్లుప్తంగా వివ‌రించారు. టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై త్వరలో ఈహెచ్ఎస్‌ స్కీంను అమలు చేస్తామని తెలిపారు. పూర్తి వివ‌రాల‌ను శ్రీవారి వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీవారి ఆస్తుల‌పై క‌మ్ముకున్న అనుమాన‌పు మేఘాలు.. విమ‌ర్శ‌ల అస్త్రాలు ప‌టాపంచ‌ల‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైవీ తెలిపిన వివ‌రాల మేర‌కు శ్రీవారి ఆస్తులు.. ఇవీ..

టీటీడీ మొత్తం ఆస్తులు : 1,128
వివిధ సంద‌ర్భాల్లో అమ్మ‌కాలు జ‌ర‌గ్గా ప్ర‌స్తుతం ఉన్న ఆస్తులు: 987
దేశవ్యాప్తంగా భక్తులు సమర్పించిన భూములు: 8088.89 ఎకరాలు
వీటిలో వ్య‌వ‌సాయ భూములు: 2085.41 ఎక‌రాలు
వ్య‌వ‌సాయేత‌ర భూములు: 6003.48 ఎక‌రాలు
1974 నుండి 2014 వరకు అధికారికంగా అమ్మిన భూములు : 335.23 ఎక‌రాలు
ఈ అమ్మ‌కాల ద్వారా స‌మకూరిన ఆదాయం : రూ.6.13 కోట్లు
దీంతో దేశవ్యాప్తంగా మిగిలిన భూములు: 7753.66 ఎకరాలు
ఇందులో వ్యవసాయ భూమి: 1792.39 ఎకరాలు
వ్య‌వ‌సాయేత‌ర భూములు: 5961.27 ఎకరాలు