Begin typing your search above and press return to search.

టీటీడీ మరో సంచలనం..తిరుపతిలో సంపూర్ణ మద్య నిషేధం!

By:  Tupaki Desk   |   23 Oct 2019 12:16 PM GMT
టీటీడీ మరో సంచలనం..తిరుపతిలో సంపూర్ణ మద్య  నిషేధం!
X
సంచలన నిర్ణయాలతో ఆసక్తిని రేపుతూ ఉంది టీటీడీ కొత్త పాలకమండలి. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు అయిన నూతన పాలకమండలి, తాజా సమావేశంలో ఆసక్తిదాయకమైన తీర్మానం చేసింది. వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో ఇప్పటికే మద్య నిషేధం ఉంది. అక్కడ సిగరెట్లకు కూడా స్థానం లేదు. ఇప్పుడు తిరుపతిలో కూడా మద్యపాన నిషేధానికి టీటీడీ సిఫార్సు చేసింది.

ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి ఏపీ ప్రభుత్వానికి తన సిఫార్సును పంపింది. తిరుపతిలో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించాలని బోర్డు కోరింది. వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి వారూ ముందుగా తిరుపతి రావాల్సిందే.

అయితే వెంకటేశ్వరుడి దర్శనం కోసమే కాకుండా - తిరుపతి ఒక కమర్షియల్ సిటీగా కూడా మారింది. తిరుమలకు భారీ ఎత్తున వచ్చే పర్యాటకుల కోసం బోలెడన్ని వ్యాపారాలు విస్తరించాయి. అందులో భాగంగా స్టార్ హోటళ్లు ఏర్పాడ్డాయి. రాయలసీమలో ఒక ప్రముఖ నగరంగా కూడా తిరుపతి మారింది.

ఇలాంటి నేపథ్యంలో అలాంటి చోట మద్యపాన నిషేధం సంచలన అంశమే. అయితే ఏపీ వ్యాప్తంగానే మద్యపాన నిషేధంగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగా ముందుగా హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యపాన నిషేధం ఆహ్వానించదగిన అంశం అవుతుంది.