Begin typing your search above and press return to search.

స్వామికీ సామాన్యుడికి మధ్య దూరమా... ఘోరమా... ?

By:  Tupaki Desk   |   26 Feb 2022 12:30 AM GMT
స్వామికీ సామాన్యుడికి మధ్య దూరమా... ఘోరమా... ?
X
ఆయన కలియుగ వైకుంఠస్వామి వారు. భక్తులను బ్రోచేందుకు దివి నుంచి భువికి దిగి వచ్చి ఇక్కడే కొలువు ఉంటున్నారు. తిరుమల తిరుపతి స్వామి వారిని జీవితంలో ఒకసారి అయినా దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడతారు. ఇక సామాన్యులే కాదు, మధ్యతరగతి వర్గాలు అయితే ఆ స్వామికి సేవ చేసుకుని తరించాలని చూస్తారు.

అలాంటి ఆర్జిత సేవల మీద టీటీడీ బోర్డు కక్షకట్టినట్లుగా రేట్లు పెంచేసే ప్రతిపాదనలు ఇపుడు జనంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికి సంబంధించి టిటీడీ బోర్డు భేటీ మీద బయటకు వచ్చిన ఒక వీడియో అయితే కలకలమే రేపింది. మీడియా ఉండగానే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సేవా టికెట్ల రేట్లను బాగా పెంచమని చెబుతున్న వీడియా ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతూ టీటీడీ పరువు తీసేసింది.

భక్తులు అంటే అంత కక్షా, లేక స్వామి భక్తులకు పెడుతున్న అగ్ని పరీక్షా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. రేటు మీద వేలం పాట వేసుకుని మరీ పెంచాలనుకోవడమే బోర్డు సభ్యుల నిర్వాకాన్ని బయటపెట్టింది.

ఇప్పటిదాకా సుప్రభాత సేవ నాలుగు వందల రూపాయలు ఉంటే దాన్ని ఎనిమిది వందలు చేయాలని బోర్డు సభ్యులు ప్రతిపాదిస్తే ఏకంగా చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డి బొత్తిగా అంత చిన్న మొత్తమేంటి రెండు వేలు చేయాలని అంటున్నారు.

ఇక తోమాల సేవ టికెట్ ని రెండు వేల రూపయాలు కాదు అని పదివేలుగా మొదట అనుకున్నారు. మొత్తానికి భక్తుల మీద దయతలచి అయిదు వేలకు ఓకే చెప్పారు. అదే విధంగా మిగిలిన సేవలు విషయానికి వస్తే కేవలం నాలుగు వందల రూపాయలు ఉన్న అర్చన సేవా టికెట్లను అయిదు వేల రూపాయలకు, కళ్యాణోత్సవం టికెట్ ని రెండు వేల అయిదు వందలకు పెంచేశారు.

మొత్తానికి టీటీడీ చేస్తోంది ఏంటి అంటే ఆదాయ మార్గాలను వెతకడం. భక్తుల మీద ఆ భారం వేయడం, భగవంతుడికి, భక్తులకు మధ్యన నిలిచి స్వామి వారి దర్శనానికి కూడా నోచుకోనీయని పరిస్థితి చేయడం. ఈ వీడియో తీసి ఎవరో పుణ్యం కట్టుకున్నారు. లేకపోతే ఈ పాటికి ఈ ధరలు అమలులోకి వచ్చేసేవి.

అయినా మాత్రమేమి రెండు మూడు రోజుల తరువాత ఇవే ధరలను ఫిక్స్ చేసి జనాలకు ఏవేవో కారణాలు చెప్పాలని టీటీడీ చూస్తోంది. మొత్తానికి తిరుమల దేవుడిని దర్శించుకునే భక్తులకు ఇలా భారం వేసి ఏం సాధిస్తారు అంటే జవాబు ఉందా. ఏది ఏమైనా గోవిందా అని స్వామిని మొక్కుకోవాల్సిన భక్తులు అంతా ఇపుడు గోవిందా అనేలా టీటీడీ బోర్డు చేస్తోంది అంటే బాధాకరమే కదా.